5 నిమిషాల్లోనే ల్యాండ్‌ రికార్డులు

10 Dec, 2020 04:40 IST|Sakshi
సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలతో అధికారులు. చిత్రంలో డిప్యూటీ సీఎం ధర్మాన, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గిరీష్, సీఎస్‌ సాహ్ని తదితరులు

సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గిరీష్‌కుమార్‌

రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి పనిచేస్తాయి

విశాఖపట్నంలో సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం

ఈ సర్వేతో ఏపీ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది

తక్కెళ్లపాడులో వాడిన సర్వే పరికరాల్లో లోపాల్లేవు

సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సమగ్ర రీసర్వేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పకడ్బందీగా, లోపరహితంగా పూర్తిచేస్తామని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరీష్‌కుమార్‌ చెప్పారు. దార్శనికతతో కూడిన ఈ బృహత్తర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్ని విధాలా సాంకేతిక సహకారం అందించడంతోపాటు సర్వే సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో బుధవారం ఆయన రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నీరబ్‌కుమార్‌ప్రసాద్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో భూసర్వే చేపట్టి జాతీయ స్థాయిలో సర్వే మ్యాపులు రూపొందించే పనిలో ప్రపంచంలోనే పురాతన సంస్థగా సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఈ అతి పెద్ద సర్వే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేకంగా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రీసర్వే కోసం నాలుగు రకాలైన సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 వేలమంది సర్వేయర్లు ఉన్నారని, వారికి శిక్షణ ఇస్తే రాష్ట్రంలో నైపుణ్యంగల మానవ వనరులు పుష్కలంగా ఉన్నట్లవుతుందని తెలిపారు. ఇందుకోసం విశాఖపట్నం కేంద్రంగా సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్టడం అభినందనీయమని చెప్పారు. దీనివల్ల అక్షాంశాలు, రేఖాంశాల ప్రాతిపదికగా కొలతలు అత్యంత లోపరహితంగా వస్తాయన్నారు. తిరుపతిలో సర్వే అకాడమీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ప్రయివేటు సర్వేయర్లకు కూడా శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో రీసర్వేలో వినియోగించిన పరికరాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవేనని, వీటిలో ఎలాంటి లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య
భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ మాట్లాడుతూ అటవీ భూములు మినహా పొలాలు, గ్రామకంఠాలు, పట్టణ ఆస్తులను సర్వేచేసి ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య ఇస్తామని తెలిపారు. భూ రికార్డులు స్వచ్ఛీకరించి మూడుదశల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 3,500 గ్రామాల్లో స్వచ్ఛీకరణ చివరిదశకు వచ్చిందని తెలిపారు. ఈ సర్వేవల్ల సరిహద్దులు పక్కాగా తెలుస్తాయని, 30 –40 ఏళ్ల వరకు భూ వివాదాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతాశయంతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  భారీ ఖర్చుకు వెనుకాడకుండా రీసర్వేకి శ్రీకారం చుట్టారని తెలిపారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మాట్లాడుతూ ప్రజలపై నయాపైసా కూడా భారం మోపకుండా సర్వే చేయడంతోపాటు సర్వే రాళ్లను కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్‌ ప్రాజెక్టుగా రీసర్వే చేసినందున ఈనెల 21న రీసర్వేని ప్రారంభించి రైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ గ్రామంలో 800 మంది రైతులుండగా 35 మంది మాత్రం కొలతలపై అభ్యంతరం తెలిపారన్నారు. జాయింట్‌ కలెక్టరు సంప్రదింపులు జరపగా 17 మంది సమ్మతించారని, 18 మంది మాత్రమే  అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు.

సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్‌ ఇండియా సహకారం
సీఎం సమక్షంలో ఎంవోయూ
రాష్ట్రంలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్‌ ఇండియా సంపూర్ణ సహాయ సహకారాలు అందించనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ సమక్షంలో సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరీష్‌ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ సాహ్ని, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నీరబ్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు