ఆస్తులకు సర్కారు భరోసా

22 Dec, 2020 03:09 IST|Sakshi
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో శా్రస్తోక్తంగా పూజలు నిర్వహించి సర్వేరాయి నాటుతున్న సీఎం జగన్‌

రీ సర్వే దేశానికే రోల్‌ మోడల్‌ 

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూరక్ష’ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ప్రతి అంగుళం కొలిచి హద్దుల నిర్ధారణ

యజమానులకు పక్కాగా హక్కుపత్రాలు

ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సాహసోపేత నిర్ణయం 

ఈ యజ్ఞానికి అవరోధాలు కల్పించే రాక్షసులున్నారు

పవిత్ర సంకల్పంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం

ప్రజల మేలు కోసమే మా ఆరాటమంతా..

ప్రజలపై పైసా భారం ఉండదు.. ఖర్చంతా ప్రభుత్వానిదే

నష్ట పరిహారం హామీ కూడా ఇస్తున్నాం

ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదు

తల్లికి బిడ్డ.. రైతుకు భూమి
బిడ్డ మీద తల్లికెంత మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది. భూమి  రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ప్లాటు అయినా, ఇల్లు అయినా, వ్యవసాయ భూమి అయినా వివాదంలో ఇరుక్కుంటే అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో కళ్లారా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని మరొకరు ఆక్రమిస్తే ఆ రైతన్న ఎంత  క్షోభకు గురవుతారో మనకు తెలుసు. రాబందుల్లాంటి  మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కొట్టేయాలని స్కెచ్‌ వేస్తే చట్టపరంగా పోరాడే శక్తి లేని కుటుంబాల పరిస్థితి ఏమిటని మనమంతా ఆలోచించాలి.

మార్చాలా వద్దా..?
మీ ఆస్తికి మిమ్మల్నే అసలైన యజమానిగా ధ్రువీకరించే  వ్యవస్థ ఉండాలా? వద్దా? మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా? వద్దా? మీ ఆస్తిని వేరెవరికో అమ్మేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలా? వద్దా? మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ చేయాలా? వద్దా? మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారంలో ఉందో, రికార్డుల్లో కనిపించాలా? వద్దా? గిట్టని వారో, కబ్జారాయుళ్లో రాళ్లు పీకేసినా, గట్టు చెదరగొట్టినా చెక్కు చెదరని పత్రాలు, ఆధారాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నారో? లేదో ఒక్కసారి ఆలోచించండి. 
– జగ్గయ్యపేట బహిరంగ సభలో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టు దేశానికే రోల్‌ మోడల్‌ కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తులు వివాదంలో చిక్కుకుంటే ఆ కుటుంబాలు పడే మానసిక వేదన మాటలకందనిదని, ఇలా ఎవరికీ జరగకూడదనే సంకల్పంతో స్థిరాస్తులపై యజమానులకు శాశ్వత హక్కులు కల్పించాలని నిర్ణయించామని ప్రకటించారు. సోమవారం కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ (రీ సర్వే) ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ విప్‌ ఉదయబాను, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం వివరాలివీ..
జగ్గయ్యపేట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పవిత్ర సంకల్పంతో సర్వేకు శ్రీకారం..
భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటే రికార్డులు పక్కాగా ఉండాలి. భూముల రికార్డులు దోషరహితంగా ఉంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు ఉండవు. మీ ఆస్తులకు మనందరి ప్రభుత్వం హామీగా ఉంటుందని మాట ఇస్తూ ‘వైఎస్సార్‌ జగనన్న భూహక్కు – భూరక్ష కార్యక్రమం’ ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనిద్వారా మీ పిల్లలు, వారసులకు మోసాలకు తావులేని విధంగా ఆస్తులపై హక్కులు కల్పిస్తాం. ఇందుకోసమే మొన్న అసెంబ్లీలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని ఆమోదించాం. పవిత్ర సంకల్పంతో సర్వే ప్రారంభిస్తున్నాం. 

వందేళ్లలో ఎన్నో మార్పులు..
వందేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాలకులు మారిపోయారు. స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం, చట్టాలు, హక్కులు వచ్చాయి. ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలు ఉండేవి. ఇవాళ స్మార్ట్‌ ఫోన్‌ లేని మనిషి ఎక్కడున్నాడా? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత మారినా 1920లో బ్రిటీష్‌ హయాం తరువాత ఇప్పటి వరకూ భూముల రీసర్వే జరగలేదు.  

పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే..
రాష్ట్రంలో కొందరికి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరో చోట ఉంది. సబ్‌ డివిజన్‌ సమస్యలున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ భూతద్దంతో వెతికినా ఒక్క పొరపాటు కూడా లేకుండా సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం యజమానులకు ఇస్తాం. మిల్లీమీటర్లతో సహా కొలిచి మ్యాపు కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్‌ పరిధిలో విలేజ్‌ మ్యాప్‌ ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్‌ నెంబర్‌ మాదిరిగా యూనిక్‌ ఐడీ నెంబర్‌ కేటాయిస్తాం. ఆ నెంబర్‌తో  భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ/ వార్డు సచివాలయాల్లో పొందుపరిచి అనంతరం భూ యజమానికి శాశ్వత టైటిల్‌ ఇస్తాం. సర్వే పూర్తయిన గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా ప్రారంభిస్తాం. 

ప్రజలపై పైసా భారం ఉండదు..
ప్రజలపై పైసా కూడా భారం మోపకుండా మొత్తం సర్వే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది. రాళ్ల ఖర్చు కూడా భరిస్తుంది. సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ పవిత్ర యజ్ఞం సాగుతుంది. 4,500 సర్వే బృందాలతో 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే నిర్వహిస్తాం. 2023 నాటికి చివరి వార్డు, గ్రామంలో కూడా ఈ సర్వేను పూర్తి చేస్తాం. 

కబ్జాలతో కోట్లకు పడగ
పరుల సొమ్ము పాము లాంటిదని పెద్దలు చెబుతారు. కబ్జా భూములతో కోట్లకు పడగెత్తాలనే దుర్మార్గమైన ఆలోచన చేసే వాళ్లు ఇవాళ ఉన్నారు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో విన్నా. ఇలాంటి అన్యాయం ఏ ఒక్కరికీ జరగరాదు. ప్రజలందరికీ మేలు చేయాలనే ఆరాటం, తాపత్రయంతోనే వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టాం.

సమన్వయం లేక...
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక భూ వివాదాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఆదాయం వస్తోందని రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆస్తిని అమ్ముతున్న వారు నిజమైన యజమానా? కాదా అనే ప్రశ్న లేకుండానే  గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి విక్రయించిన సందర్భాలను చూస్తున్నాం. 

నష్ట పరిహారం హామీ కూడా..
ఎక్కడైనా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ద్వారా హక్కు పత్రాలు పొందిన వారికి ఆస్తిపై హక్కు లేదని తేలితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుందనే హామీ ఇస్తున్నాం. ఇటువంటి చట్టం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రం దీనికి మొట్టమొదటిగా నాంది పలుకుతోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా భూములను ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా కొనుక్కోవచ్చు. ఏపీలో మొదలైన ఈ విప్లవాత్మక కార్యక్రమం దేశమంతా ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో నిజాయితీ తెస్తామనే మాటకు కట్టుబడి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 18 నెలల్లో ఈ దిశగా ముందడుగు వేశామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. 

దేశంలోనే అతిపెద్ద రీ సర్వే ప్రారంభం
దేశంలోనే అతి పెద్ద రీ సర్వే ఏపీలో ప్రారంభమైంది. కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష’ పైలట్‌ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు సీఎం స్వయంగా హక్కు పత్రాలను అందజేశారు. తక్కెళ్లపాడు ట్రై జంక్షన్‌లో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సర్వేరాయి నాటిన అనంతరం మీట నొక్కి డ్రోన్లను గాలిలోకి పంపించారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్టాళ్లను తిలకించారు. సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్‌ రికార్డుల విభాగం స్టాల్‌లో ప్రదర్శించిన 1866 నాటి రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిష్టర్, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)లను సీఎం పరిశీలించారు. సర్వే ఆఫ్‌ ఇండియా స్టాల్‌లో ఆధునిక పద్ధతుల గురించి సంస్థ డీజీ గిరీష్‌కుమార్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు