‘భూస్కామ్ చేసిన బాబుకు నోటీస్‌ వస్తే తప్పేంటి’

16 Mar, 2021 14:48 IST|Sakshi

కృష్ణా జిల్లా: అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కామ్‌లు చేశారని, సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో దళిత వర్గాలను మోసం చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కుదారులైన దళితులను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని చెప్పారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కోపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కల బుద్ధ వెంకన్న మొరుగుతున్నా తాము అదిరేది లేదు బెదిరేది లేదని స్పష్టం చేశారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్‌లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలోఅవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాల కంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం, దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు: ఆర్కే
సీఆర్డీఏ చైర్మన్‌గా ఉండి చంద్రబాబు, నారాయణ పెద్ద కుట్ర చేశారని.. పక్కా ప్లాన్‌తో ఎస్సీ, ఎస్టీల భూములు కాజేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల భూములు కొట్టేశారని తెలిపారు. ఇక తాడికొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలను భయపెట్టి లాక్కున్నారని చెప్పారు. ప్యాకేజీ రాదు.. భూములు ఇవ్వాల్సిందేనని బలవంతంగా లాక్కున్నారని వివరించారు. శివాయి జమీందార్, లంక భూములు, ప్రభుత్వ, దేవాదాయ భూములను కూడా తన మనుషులకు కట్టబెట్టారని ఆర్కే వివరించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులను తారుమారు చేయించారని ఆరోపించారు. పట్టా భూములను సైతం కారుచౌకగా కొట్టేశారని తెలిపారు. జీవోలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారని, ఐఏఎస్‌ను తప్పించి చంద్రబాబు సీఆర్డీఏ చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. జీవో మీద చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉండవు.. కానీ నోటిఫై ఫైల్స్‌ మీద మాత్రం చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉన్నాయి అని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు, నారాయణ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు