AP: సర్వే బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు..

23 Apr, 2022 16:44 IST|Sakshi

కీలక బాధ్యతలు మండల సర్వేయర్ల నుంచి బదలాయింపు

సర్వే సబ్‌ డివిజన్‌ బాధ్యత గ్రామ సర్వేయర్లదే

హద్దుల నిర్ధారణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ వారికే

సర్వే సర్వీసుల్లో జాప్యాన్ని నివారించడమే లక్ష్యం 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భూముల సర్వే సహా ఇతర ముఖ్యమైన మండల సర్వేయర్ల బాధ్యతలను వీరికి బదలాయించింది. సర్వేను వేగంగా నిర్వహించి దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండడంతో సర్వే వ్యవహారాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వే కోసం భూయజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు మండల సర్వేయర్ల బాధ్యతలను గ్రామ, వార్డు సర్వేయర్లకు అప్పగించింది. 

1983 తర్వాత.. గ్రామ స్థాయికి సర్వే సర్వీసు 
ప్రధానంగా రికార్డుల ప్రకారం భూముల సరిహద్దుల్ని నిర్ధారించే ఎఫ్‌.లైన్‌ సర్వీసును గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. ఎఫ్‌ఎంబీ (ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌), ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌), పీపీఎం (ప్రోపర్టీ పార్సిల్‌ మ్యాప్‌) ప్రకారం భౌతికంగా క్షేత్రస్థాయిలో హద్దుల్ని తెలిపేదాన్ని ఎఫ్‌ లైన్‌ సర్వీసుగా చెబుతారు. ఎవరైనా తమ భూములు, స్థలాల్ని విక్రయించినప్పుడు, భూమి హద్దుల్ని తనిఖీ చేసుకోవాలనుకున్నప్పుడు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. 1983కి ముందు సర్వే శాఖలో కింది స్థాయిలో ఉన్న తాలూకా సర్వేయర్‌ ఈ పని చేసేవారు. ఆ తర్వాత మండల వ్యవస్థ రావడంతో మండల సర్వేయర్లు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పారు. సచివాలయాల్లో ప్రత్యేకంగా 11 వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మండల సర్వేయర్ల బాధ్యతల్ని వాళ్లకి అప్పగించి సర్వే సర్వీసుల్ని ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఇందుకనుగుణంగా సర్వే ప్రక్రియలో మార్పులు చేసింది. 15 రోజుల్లో సర్వే దరఖాస్తును పరిష్కరించాలని నిర్దేశించింది. గ్రామ సర్వేయర్‌ సర్వే నిర్వహించాల్సిన విధానం, అభ్యంతరాల పరిశీలన, దరఖాస్తును తిరస్కరిస్తే ఏ కారణాలతో తిరస్కరించాలో మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే భూముల రికార్డుల నిర్వహణను కూడా వారికే అప్పగించింది. (క్లిక్: సంక్షేమాభివృద్ధి పథకాలు ఆపేయాలట!)

27 రోజుల్లో సబ్‌ డివిజన్‌ పూర్తి చేయాలి  
భూముల సబ్‌ డివిజన్‌ బాధ్యతను కూడా మండల సర్వేయర్‌ నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించింది. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే మ్యుటేషన్, సబ్‌ డివిజన్‌ చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో సబ్‌ డివిజన్‌ కేసుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ఆ బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. స్క్రుటినీ బాధ్యతల్ని మాత్రం మండల సర్వేయర్లు చేస్తారు. 27 రోజుల్లో సర్వే సబ్‌ డివిజన్‌ పూర్తి చేయాలని నిర్దేశించింది. సర్వే దరఖాస్తుల తిరస్కరణ ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు సర్క్యులర్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌ సాయి ప్రసాద్‌ విడుదల చేశారు. (క్లిక్: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్‌ స్టేషన్లు)

మరిన్ని వార్తలు