స్పిన్నింగ్‌ పరిశ్రమపై మాంద్యం దెబ్బ 

11 Oct, 2022 03:44 IST|Sakshi

ఆర్డర్లులేక మూతపడుతున్న పరిశ్రమలు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటేనే మనుగడ 

నేటి నుంచి 15 రోజుల పాటు మిల్లులు మూసివేస్తున్నాం 

ఏపీ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి 

కొరిటెపాడు (గుంటూరు):  కోవిడ్, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆ ప్రభావం స్పిన్నింగ్‌ మిల్లుల పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కోవిడ్‌ విపత్తు తర్వాత ఆర్డర్లులేని పరిస్థితుల్లో ముడిసరుకు దూది ధరకంటే నూలు ధర తక్కువ కావడం, ఎగుమతులు క్షీణించడం.. స్వదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవడం వంటి వరుస పరిణామాలు పరిశ్రమను వెంటాడుతున్నాయి.

గత ప్రభుత్వం స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.947 కోట్లు రాయితీలను బకాయి పెడితే కోవిడ్‌ కష్టాలను గమనించిన ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.380 కోట్ల బకాయిలను చెల్లించింది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టెక్స్‌టైల్‌ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండంతో మిల్లులను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో.. మంగళవారం నుంచి 15 రోజుల పాటు స్పిన్నింగి మిల్లులను మూసివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి ప్రకటించారు.  

50 శాతం ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. 
రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమల అసోసియేషన్‌ గత సమావేశంలో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిలో 50 శాతం నిలిపివేయాలని తీర్మానం చేసిందని, కానీ.. ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణించిన దృష్ట్యా మొత్తం అన్ని పరిశ్రమలు పూర్తిగా మూసివేసి, నష్టాలబారి నుంచి బయటపడాలని నిర్ణయించినట్లు రఘురామిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను, ఎంసీఎక్స్‌ను కట్టడిచేసి, పత్తి ధరలు నిలకడగా ఉండేలా చూడాలని కోరారు.

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం కరోనా వేళ గతేడాది సెప్టెంబర్‌లో రూ.237 కోట్లు విడుదలచేసి ఆదుకుందన్నారు. అదే విధంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.   

మరిన్ని వార్తలు