పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు

14 Feb, 2021 05:27 IST|Sakshi
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ప్రారంభమైన ఇళ్ల నిర్మాణ పనులు

లేఅవుట్లలో భూమిపూజ, శంకుస్థాపనల జోరు

నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారానికి చర్యలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పటికే పునాదుల వరకు నిర్మాణాలు జరగ్గా.. మరికొన్ని చోట్ల భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నారు. సొంత స్థలం, పొజిషన్‌ సర్టిఫికెట్లు కలిగిన లబ్ధిదారులు వారు కోరుకున్న కొలతల్లో ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. లేఅవుట్‌ కాలనీల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. 68,361 ఎకరాల్లో కొత్తగా వేసిన 17,005 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది నిర్మాణ పనులు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట లేఅవుట్‌లో లబ్ధిదారులు రెండు రోజులుగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ పునాదులు తీశారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఇళ్ల పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ఇదే రీతిలో రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో వాటికి అవసరమైన ఇసుక, సిమెంట్‌ కొరత రాకుండా చూసే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా లబ్ధిదారుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో సరైన విధానాలు అవలంబించడంతోపాటు ఎప్పటికప్పుడు ప్లానింగ్‌ అనుసరిస్తే అనుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేసేందుకు అవకాశముందని వారు వివరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు