చితి మంటల్లోనూ ఒక్కటిగా..

4 Jan, 2023 09:32 IST|Sakshi

సాక్షి, ప్రత్తిపాడు: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో పరాయి దేశం వెళ్లారు. పగలూ రాత్రీ కష్టపడ్డారు. ఇద్దరు పిల్లాపాపలతో జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతున్న వేళ విధికి కన్నుకుట్టినట్లుంది. వారిపై విషం చిమ్మింది. మంచు గడ్డల రూపంలో మృత్యువు కాపు కాసి భార్యాభర్తలిద్దరినీ కానరాని లోకాలకు తీసుకువెళ్లి, వారి ఇద్దరి కుమార్తెలను ఒంటరులను చేసింది. అమెరికాలో దుర్మరణం పాలైన తెలుగు దంపతుల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి.  

అసలేం జరిగిందంటే..  
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26న సెలవు కావడంతో పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో దంపతులు సరస్సులో గల్లంతై, చివరకు మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలు అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాయి.

టీసీఎస్‌ కంపెనీ సహకారంతో సోమవారం ఉదయం అమెరికాలోని డల్లాస్‌ నుంచి మృతదేహాలను హైదరాబాద్‌కు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో పాలపర్రులోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. వారి పిల్లలను రెండు రోజుల కిందటనే తీసుకువచ్చారు.  నారాయణ, హరిత దంపతుల మృతదేహాలను చూడగానే రోదనలు మిన్నంటాయి.

బిడ్డా.. ఇక నుంచి మాకు ఫోన్లు ఎవ్వరు చేస్తారు.. అంటూ నారాయణ తల్లి వెంటరత్నం విలపించింది. హరిత తల్లిదండ్రులూ కన్నీరుమున్నీరయ్యారు. నారాయణ, హరిత పిల్లలు పూజిత, హర్షిత నిర్జీవంగా ఉన్న తల్లిదండ్రులను చూసి దిగాలుగా ఉండిపోయారు. నారాయణ, హరిత దంపతుల చితిలను ఒక్కచోటే పేర్చి అంత్యక్రియలు పూర్తిచేశారు.  వారిని ఆఖరి చూపు చూసేందుకు ఊరంతా కదిలివచ్చింది. భౌతికకాయాల వద్ద  ఎమ్మెల్సీ లక్ష్మణరావు నివాళులరి్పంచారు.  

(చదవండి: రాజమండ్రి: తక్షణ సాయం.. సీఎం జగన్‌ సాయం జీవితాంతం మరువలేనిది)

మరిన్ని వార్తలు