పోలీస్‌ వ్యవస్థను అగౌరవపరిచిన ‘బొండా’పై చర్యలు తీసుకోండి 

24 Oct, 2021 03:56 IST|Sakshi

పోలీసులకు న్యాయవాదుల ఫిర్యాదు  

అనంతపురం/గుంటూరు ఈస్ట్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, డీజీపీని, పోలీస్‌ వ్యవస్థను అగౌరవపరుస్తూ మాట్లాడిన విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ఇస్తాక్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొన్న బొండా.. బాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా, సీఎం జగన్‌ను అగౌరవపరుస్తూ మాట్లాడారన్నారు.

గొడవలు సృష్టించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఆ ప్రసంగాన్ని టీడీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని తెలిపారు. ‘మా నాయకుడు చిటికేస్తే మీ డీజీపీ, మీ పోలీసులు ఎంతమంది ఉన్నా.. తాడేపల్లి మీద దాడి చేసి ఒక్క గంటలో ధ్వంసం చేస్తామం’టూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అక్కడే ఉన్న చంద్రబాబుగానీ, ఇతర నాయకులు గానీ వారించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొండాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.  

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు యత్నం  
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను అరెస్ట్‌ చేయాలంటూ అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో గుంటూరు నగర మేయర్‌ కావటి నాగమనోహర్‌నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ సీఎంను దూషించడమే కాకుండా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూలగొడతామంటూ సవాలు  విసిరి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బొండా ఉమాను వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పట్టాభి అమలు చేసినట్టు చెప్పారు.    

మరిన్ని వార్తలు