న్యాయవాదుల బీమా పథకానికి శ్రీకారం

1 Jan, 2021 05:28 IST|Sakshi
న్యాయవాదుల బీమా పాలసీ కార్డును అందజేస్తు్తన్న బీమా కంపెనీ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టిన లాయర్ల బీమా పథకం అమలుకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బార్‌ కౌన్సిల్‌ ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లించింది. మొదటి పాలసీని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌కు కంపెనీ ప్రతినిధులు గురువారం అందచేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి, రవి గువేరా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది, వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల వరకు నగదు రహిత వైద్యసాయం, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ బీమా సౌకర్యం కోసం 15,552 మంది న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ప్రీమియం కింద ఒక్కొక్కరు రూ.5,348 చొప్పున చెల్లించాల్సి ఉండగా, ఇందులో న్యాయవాది వాటా రూ.1000 కాగా, మిగిలిన మొత్తాన్ని(రూ.4,348) ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం చెల్లిస్తుంది. సంక్షేమ నిధికి ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఈ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. 2020, డిసెంబర్‌ 30 నుంచి 2021, డిసెంబర్‌ 29 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి రూ.25 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు గంటా రామారావు, నాగిరెడ్డి తదితరులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు