మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..

7 Jul, 2022 07:43 IST|Sakshi

మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్‌ అలకాటూరు. 

నగరి: మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్‌ గ్రూప్‌–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నంబాకం ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  పూర్తిచేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు.

అయితే కలెక్టర్‌ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్‌కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్‌ రాసినా మెయిన్స్‌ క్లియర్‌ కాలేదు. లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లోని మెటీరియల్‌నే చదివారు.  2018లో సివిల్స్‌ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్‌ కళాశాలకు బదిలీపై వెళ్లారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మహేష్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈయన భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్‌గా ఉన్నారు.

చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ)

సాధనతోనే సాధ్యం 
సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్‌లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్‌గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్‌లైన్‌లో ఎన్‌సీటీ మెటీరియల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చదివారు. అలాగే ఆన్‌లైన్‌లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్‌ సివిల్స్‌లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్‌ నాకు మెటీరియల్‌గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్‌పై పట్టు పెంచుకుంటే సివిల్స్‌లో రాణించవచ్చు. న్యూస్‌ రీడింగ్‌ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది.          
–మహేష్, నంబాకం గ్రామం, నగరి మండలం.  

మరిన్ని వార్తలు