అది కేసును ప్రభావితం చేసే కుట్రే

6 Jun, 2021 05:45 IST|Sakshi

ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు నిబంధనలకు విరుద్ధం

వస్తువు జప్తు గురించి నిందితుడు మాట్లాడకూడదు

దర్యాప్తు అధికారులకు జప్తు చేసే అధికారం ఉంది

విచారణలో భాగంగా న్యాయస్థానానికి ఎప్పుడైనా చెప్పొచ్చు

స్పష్టం చేస్తున్న న్యాయ నిపుణులు

సాక్షి, అమరావతి: సీఐడీ అధికారులు తన సెల్‌ఫోన్‌ తీసుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే కుట్రతోనే ఆయన ఇలా చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. కేసు విచారణలో భాగంగా ఏదైనా వస్తువును జప్తు చేసే చట్టబద్ధమైన అధికారం దర్యాప్తు అధికారులకు ఉందనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు మాట్లాడ కూడదని.. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది విచారణను ప్రభావితం చేయడం కిందకు వస్తుందని చెబుతున్నారు. కేవలం విచారణను తప్పుదారి పట్టించాలనే దురుద్దేశంతోనే రఘురామకృష్ణరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు భారత శిక్షా స్మృతిలోని నిబంధనలను న్యాయ నిపుణులు ప్రధానంగా ఉదహరిస్తున్నారు. 

జప్తు చేసే విశేష అధికారాలు 
సెక్షన్‌ 102 ప్రకారం నేరంతో సంబంధం ఉందని అనిపించిన వస్తువులను జప్తు చేసే అధికారం దర్యాప్తు అధికారికి ఉంది. దర్యాప్తు సమయంలో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అప్పటికప్పుడు తటస్థ సాక్షులతో నిమిత్తం లేకుండా జప్తు చేసే విశేష అధికారాలు కూడా అధికారులకు ఉన్నాయి. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడానికి సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కొన్ని సార్లు కింది స్థాయి అధికారులు దర్యాప్తునకు వెళ్లినప్పుడు జప్తు చేసిన వస్తువుల గురించి విచారణ అధికారికి తెలియజేయాలి. విచారణ కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయస్థానానికి సమర్పిస్తామని లిఖిత పూర్వకంగా తెలియజేస్తే సరిపోతుంది. 

ఎప్పుడైనా సమర్పించవచ్చు
సెక్షన్‌ 167 ప్రకారం జప్తు చేసిన వస్తువుల గురించి రిమాండ్‌ రిపోర్ట్‌తో పాటు సమర్పించాలని లేదు. కేసు విచారణలో భాగంగా ఎప్పుడైనాసరే సమర్పించవచ్చు. న్యాయస్థానానికి తరలించడానికి అవకాశం ఉన్న వస్తువుల జప్తు గురించి తర్వాత అయినా సరే ప్రస్తావించవచ్చు. తరలించడానికి అవకాశం లేనివాటి గురించి అప్పటికప్పుడు చెప్పాలి. రఘురామకృష్ణరాజు కేసులో సెల్‌ఫోన్‌ అన్నది న్యాయస్థానానికి తరలించదగిన వస్తువే కాబట్టి దాని గురించి తర్వాత చెప్పే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది.

ఆ వస్తువుల గురించి నిందితుడు మాట్లాడరాదు
సెక్షన్‌ 165 ప్రకారం దర్యాప్తు అధికారులు జప్తు చేసిన వస్తువుల గురించి నిందితుడు మాట్లాడకూడదు. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఈ దృష్ట్యా తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని రఘురామకృష్ణరాజు ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. జప్తు చేసిన వస్తువులు అన్నింటి గురించి కూడా దర్యాప్తు అధికారులు వెంటనే ప్రస్తావించాలని కచ్చితమైన నిబంధన లేదు. కొన్ని సార్లు వివిధ కారణాలతో అన్ని వస్తువుల గురించి ప్రస్తావించలేకపోవచ్చు. తర్వాత చార్జ్‌షీట్‌ నమోదు చేసినప్పుడుగానీ ప్రత్యేక మెమో వేసిగానీ ఆ వస్తువుల జప్తు గురించి న్యాయస్థానానికి తెలియజేసే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది.  

రఘురామకృష్ణరాజు వాదన అసంబద్ధం
తన సెల్‌ఫోన్‌ను జప్తు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు వెల్లడించలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం అసంబద్ధంగా ఉంది. దాని గురించి విచారణ సమయంలో ఎప్పుడైనా చెప్పొచ్చు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు రఘురామకృష్ణరాజు మాట్లాడటం నిబంధనలకు వ్యతిరేకం. కేవలం దర్యాప్తు అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, కేసును ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు. జప్తు అంశాల్లో లోటుపాట్లను సాకుగా చూపించి కేసు నుంచి తప్పించుకోలేరని పంజాబ్‌ ప్రభుత్వం వర్సెస్‌ బల్బీర్‌సింగ్‌ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది.
– కోటంరాజు వెంకటేశ్‌ శర్మ, న్యాయవాది 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు