అమాంతంగా పెరిగిన నిమ్మ ధర.. రేటు ఎంతంటే..?

3 Feb, 2023 15:01 IST|Sakshi

కనిగిరి టూ ఢిల్లీ, ముంబై ఉత్సాహంలో రైతు 

పండు కాయ కేజీ రూ.15 

పచ్చికాయ రూ.25 నుంచి రూ.30 

మార్చిలోపు మరింత పెరిగే అవకాశం

హనుమంతునిపాడు/కనిగిరి రూరల్‌: నిమ్మ రైతు పంట పండింది. నిన్న మొన్నటి వరకూ సరైన ధరల్లేక దిగాలుగా ఉన్న రైతుకు మార్కెట్‌ ధరలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. వారం రోజుల కిందట వరకూ కిలో రూ.10 నుంచి రూ.15 పలికింది. నేడు మార్కెట్లో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతున్నాయి. నాణ్యత పెరగడంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో నిమ్మకు డిమాండ్‌ పెరిగింది. రానున్న రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

జిల్లాలోనే అత్యధికంగా నిమ్మతోటల సాగు కనిగిరి నియోజకవర్గంలోనే జరుగుతోంది. వ్యాపారులు, రైతుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల వరకు నిమ్మ సాగవుతోంది. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే సుమారు 32 వేల ఎకరాల వరకు సాగు ఉన్నట్లు అంచనా. అందులో హెచ్‌ఎం పాడు మండలంలో 20 వేల ఎకరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత సీఎస్‌ పురం, వెలిగండ్ల మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల వరకు సాగవుతోంది.

యర్రగొండపాలెం, చీమకుర్తి, దర్శి, చినారికట్ల, కొణిజేడు తదితర ప్రాంతాల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ హాయంలో వర్షాలు లేక చాలా వరకు నిమ్మ తోటలను రైతులు నరికేశారు. వర్షాలు పడక, బోర్ల కింద సాగుచేసిన పంటలకు పెట్టుబడులు పెరిగి వాటికి గిట్టుబాటు ధరల్లేక అల్లాడారు. చాలా మంది తోటలపైనే కాయలు వదిలేశారు. అయినప్పటికీ జిల్లాలో హెచ్‌ఎం పాడులోనే అత్యధికంగా నిమ్మ సాగు ఉంది. ఈ మండలంలోని ఎర్రనేలలో పండే నిమ్మకు ఎక్కువ శాతం గిరాకీ ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.  

ప్రస్తుతం కలిసి వచ్చిన కాలం...  
ప్రస్తుత కాలంలో వర్షాలు పడి భూగర్భ జలాలు పెరగడంతో రైతులు మళ్లీ నిమ్మతోటల సాగుకు ముందుకొచ్చారు. ఫలితంగా లేత తోటలు అధికంగా ఉండి ముదురు తోటలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో దిగుబడి రోజుకు నాలుగు, ఐదు లారీలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు లారీల లోడు మాత్రమే మార్కెట్‌కు వస్తోంది. దీంతో సీజన్‌ ప్రారంభం కావడం, డిమాండ్‌కు తగిన సరుకు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.15 వరకు ధర పెరిగింది.

గతంలో ఆటోలు, కూలీల ఖర్చులకుపోను నామ్‌కే వాస్తే ఆదాయంతో దిగాలు చెందుతున్న రైతన్నకు ఒక్కసారి ధరలు పెరగడంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మ ధర రూ.25 నుంచి రూ.30 మధ్య పలుకుతోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో రూ.50కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

కనిగిరి టూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు...  
కనిగిరి పట్టణంలో సుమారు 6 వరకు హోల్‌సేల్‌ వ్యాపార దుకాణాలున్నాయి. సీజన్‌లో రోజుకు సుమారు 5 నుంచి 6 లారీలు 50 వేల టన్నుల నిమ్మకాయలను చెన్నై, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా చెన్నై, బెంగళూరు మార్కెట్‌కు వెళ్తాయి. అయితే ప్రస్తుతం 2 లారీల నిమ్మకాయలు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి.  

ప్రస్తుతం కేజీ రూ.30 వరకు తీసుకుంటున్నాం 
వారం రోజుల వరకు కూడా పండు కాయ కేజీ రూ.10కి, పచ్చి కాయ రూ.15కి కొనేవాళ్లం. ప్రస్తుతం కాయ ఎగుమతికి డిమాండ్‌ రావడం, సరుకు దిగుబడి, ఉత్పత్తి తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పండు కాయ రూ.15కు, పచ్చికాయ రూ.28 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నాం. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరునాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 
– నర్సయ్య, హోల్‌ సేల్‌ వ్యాపారి 

మరిన్ని వార్తలు