కాకినాడ రేవు ప్రతిష్టను దెబ్బతీయొద్దు

20 Feb, 2022 04:20 IST|Sakshi
మాట్లాడుతున్న వారణాసి రఘు. చిత్రంలో లారీ ఓనర్స్, ఎక్స్‌పోర్టర్స్, బార్జి ఓనర్స్‌ ప్రతినిధులు

మాజీ సీఎం చంద్రబాబుకు పోర్టు వర్గాల లేఖ

కాకినాడ: బియ్యం ఎగుమతుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న కాకినాడ రేవు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని కోరుతూ పోర్టు ఆధారిత వర్గాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం లేఖ రాశాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ సహా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎటువంటి మచ్చా లేకుండా పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు.

ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కోకనాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఆలిండియా రైస్‌ ఎక్స్‌పోర్టర్స్, బార్జి ఓనర్స్, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడారు. కాకినాడ రేవు నుంచి ఆఫ్రికాతో పాటు ఇతర దేశాలకు కూడా బియ్యం రవాణా అవుతున్నాయన్నారు. ఇక్కడి నుంచి వెళ్లే బియ్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో పండించినదేనన్న అపోహలతో పాటు, అనేక అంశాలకు ముడిపెడుతూ వస్తున్న కథనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వాస్తవానికి 60 నుంచి 70 శాతం బియ్యం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి, కాకినాడ నుంచి ఎగుమతి అవుతోందన్న వాస్తవాన్ని గుర్తించాలని వారు కోరారు. రాజకీయ పరమైన వివాదాలకు కాకినాడ రేవును కేంద్రంగా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

అక్రమాలకు ఆస్కారం లేదు
కస్టమ్స్‌ వంటి ఎన్నో కేంద్ర శాఖల పర్యవేక్షణలో ఇక్కడి కార్యకలాపాలు జరుగుతుంటాయని, రేవులో అక్రమాలకు ఎటువంటి ఆస్కారమూ ఉండదని ఆ ప్రతినిధులు స్పష్టంచేశారు. ఇక్కడి నుంచి బాయిల్డ్, రా, బ్రోకెన్‌ రైస్‌తో పాటు బొగ్గు, జొన్న వంటి మరెన్నో ఎగుమతులు కూడా నిరంతరాయంగా సాగుతున్నాయన్నారు. టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయా పోర్టు ఆధారిత వర్గాలు వేర్వేరుగా మాజీ సీఎం చంద్రబాబునుద్దేశించి ఈ లేఖలు రాశాయి. సమావేశంలో కోకనాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు వారణాసి రాఘవులు (రఘు), ఆలిండియా రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డీవీ కృష్ణారావు, కార్యదర్శి వినోద్‌ అగర్వాల్, ఉపాధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, కోశాధికారి కె. భాస్కరరెడ్డి, బార్జి ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బంధన హరి, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌ఎస్‌ రాజు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు