ర్యాక్‌లు కొనుక్కోండి

8 Aug, 2022 03:56 IST|Sakshi

బొగ్గుపై రాష్ట్రాలకు కేంద్రం లేఖలు 

రైల్వేల ద్వారా ఏపీకి రోజూ 10 – 12 ర్యాక్‌ల బొగ్గు సరఫరా 

కనీసం 20 ర్యాక్‌లు కావాలని కోరుతున్న ఏపీ జెన్‌కో 

సొంతంగా కొనాలంటే పెనుభారమే.. నిర్వహణ మరో గుదిబండ

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఖాళీ అయ్యాయి. బొగ్గు రవాణాలో జాప్యం కారణంగా రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే బొటాబొటిగా అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం సరుకు రవాణా రైళ్లకు నెలకొన్న డిమాండ్‌ దృష్ట్యా ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బొగ్గు తరలింపు కోసం కనీసం 10 రైల్వే ర్యాక్‌లను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల సెప్టెంబర్‌ వరకూ విద్యుదుత్పత్తి సాఫీగా సాగుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ పేర్కొంది. అయితే ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

70 ర్యాక్‌లు నిల్వ ఉంచండి.. 
కొరత దృష్ట్యా కనీసం 70 ర్యాక్‌ల బొగ్గును నిల్వ ఉంచాలని ఎన్టీపీసీ లిమిటెడ్, దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ సంస్థలకు కేంద్ర విద్యుత్‌ శాఖ లేఖలు రాసింది. బొగ్గు తరలింపు కోసం పూర్తిగా రైల్వేలపై ఆధారపడొద్దని లేఖలో పేర్కొంది.  

ఇదీ పరిస్థితి.. 
రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణి కాలరీస్, ఒడిశాలోని మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. రెండు చోట్లా కలిపి రోజూ దాదాపు 10 నుంచి 12 ర్యాక్‌ల బొగ్గు వస్తోంది. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్‌)లో రోజుకి 28,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా అక్కడ ప్రస్తుతం 98,566 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3, 4 రోజులకు సరిపోతాయి. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా 2,99,947 మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 15 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు.

రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ)లో 21,000 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా ఇక్కడ ప్రస్తుతం కేవలం 7,997 మెట్రిక్‌ టన్నులే ఉంది. వర్షాకాలం కావడంతో డిమాండ్‌ తగ్గి రోజుకు 196.27 మిలియన్‌ యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. హిందూజా పవర్‌ ప్లాంట్‌ నుంచి కూడా రాష్ట్రానికి విద్యుత్‌ అందుతోంది. ఇక్కడ రోజుకి 9,600 మెట్రిక్‌ టన్నులు బొగ్గు వినియోగిస్తుండగా ప్రస్తుతం 30,917 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఈ నిల్వతో మూడు రోజులు విద్యుదుత్పత్తి చేయవచ్చు. బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు 20 ర్యాక్‌ల వరకూ కేటాయింపులు పెంచాలని ఏపీ జెన్‌కో కోరుతోంది.  

పెరిగిన ఉత్పత్తి, డిమాండ్‌ 
రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి 27 శాతం పెరిగింది. గతేడాది జూన్‌ నాటికి 12,428.41 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి  15,913.37 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. మరోవైపు దీనికి తగ్గట్లు బొగ్గుకు డిమాండ్‌ ఏర్పడింది.

ఆర్థికంగా భారమే..
‘ర్యాక్‌లు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్రం గతంలోనూ చెప్పింది. సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేస్తే రవాణా ఖర్చుల్లో దాదాపు 10 శాతం రాయితీ కూడా అందిస్తామంటోంది. అయితే ఇదేమీ తప్పనిసరి కాదు. ర్యాక్‌లను కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వాటి నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ప్రభుత్వ రంగ థర్మల్‌ కేంద్రాలు సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్రం సూచన మేరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రైవేట్‌ సంస్థలు ర్యాక్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంది’ 
–బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో 

మరిన్ని వార్తలు