కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

6 Apr, 2021 03:47 IST|Sakshi

రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇప్పటికే ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

ఉత్తర కోస్తాంధ్రలో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వివరించారు. సోమవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలో 39.3, జంగమేశ్వరపురం, కర్నూలులో 39.2. కడపలో 38.2, తిరుపతిలో 37.7, నందిగామలో 37.6, అమరావతిలో 36.6, ఆరోగ్యవరంలో 36.5, తుని 36.2, విజయవాడలో 36.0, కాకినాడలో 35.6, నెల్లూరు 35.5, విశాఖపట్నం 33.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   

మరిన్ని వార్తలు