గిద్దలూరు–వినుకొండ రోడ్డుకు లైన్‌క్లియర్‌

24 Jan, 2022 03:41 IST|Sakshi

రూ.925.60 కోట్లతో 112 కి..మీ. రహదారి నిర్మాణం

సాక్షి, అమరావతి: రాయలసీమను విజయవాడతో అనుసంధానిస్తూ మరో కొత్త రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు కొత్త రహదారిని నిర్మించనున్నారు. ప్రధానంగా రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి విజయవాడకు మరింత మెరుగైన కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సానుకూలంగా స్పందించింది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్‌ హైవే, అనంతపురం నుంచి విజయవాడకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. వాటితో రాయలసీమ ప్రాంతానికి పూర్తిస్థాయిలో అనుసంధానం సాధ్యపడుతోంది. కానీ, రాయలసీమలోని నల్లమల ప్రాంతానికి మాత్రం విజయవాడతో సరైన రహదారి లేకుండాపోయింది. దాంతో సీమలోని వెనుకబడిన ప్రాంతాలను విజయవాడ ప్రాంతంతో మరింతగా అనుసంధానించేందుకు గిద్దలూరు–వినుకొండ రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వినుకొండ నుంచి విజయవాడకు ఇప్పటికే ప్రధాన రహదారితో కనెక్టివిటీ ఉంది. కాబట్టి గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రహదారి నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ సానుకూలంగా స్పందించి ప్రాజెక్టును ఆమోదించింది. 

రూ.925.60 కోట్లతో ప్రణాళిక
► ఈ జాతీయ రహదారిని ఎన్‌హెచ్‌–544డీ పేరుతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు నిర్మిస్తారు. 
► 112.80 కి.మీ. పొడవున రెండు వరుసల రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.925.60 కోట్ల ప్రణాళికను ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించింది. 
► ఈ రహదారి నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ త్వరలో శంకుస్థాపన చేస్తారు. 
► 2023 జనవరి నాటికి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు