తస్మాత్‌ జాగ్రత్త! లింక్‌ నొక్కితే.. నిలువు దోపిడీ

20 Apr, 2021 04:26 IST|Sakshi

సైబర్‌ నేరగాళ్ల నయా మోసాలు

పింక్‌ వాట్సాప్‌ అంటూ లింక్‌ వైరల్‌

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ల పేరుతో ఎర

వాటి ఉచ్చులో పడొద్దంటున్న సైబర్‌ పోలీసులు

  • మీ వాట్సాప్‌ ఆకర్షణీయమైన పింక్‌ కలర్‌లో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ లింక్‌ క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
     
  • మీ మొబైల్‌ ఫోన్‌లో అన్ని రకాల సినిమాలను హై క్వాలిటీలో చూడాలనుకుంటున్నారా? ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను లైవ్‌లో చూసి ఆనందించాలనుకుంటున్నారా? అయితే మీరు డబ్బులు చెల్లించకుండానే వాటిని అమెజాన్‌ ప్రైమ్, నెటిఫ్లిక్స్‌లో ఆస్వాదించండి. మీరు చేయాల్సిందల్లా ఈ లింక్‌ను క్లిక్‌ చేయడమే. 
     
  • మీ స్మార్ట్‌ ఫోన్‌లోని ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో మీరు ఊహించని గేమ్స్, సినిమాలు, మరెన్నో యాప్‌లు తక్కువ రేటుకే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ లింక్‌ను ఓపెన్‌ చేసి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

ఇటువంటి ఆకర్షణీయమైన, ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మకంగా పంపించే లింకులను క్షణం ఆలోచించకుండా క్లిక్‌ (ఓపెన్‌) చేస్తే మీరు తప్పులో కాలేసినట్టే. సైబర్‌ నేరగాళ్లు నయా దందాలకు ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు సైబర్‌ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఫేస్‌బుక్‌ అక్కౌంట్లను హ్యాక్‌ చేసి ఖాతాదారు ఫ్రెండ్స్‌తో మెసెంజర్‌ ద్వారా నమ్మకంగా చాటింగ్‌ చేసి డబ్బులు దండుకుంటున్న సైబర్‌ క్రైమ్‌ ముఠాలు చెలరేగిపోయాయి. తాజాగా వాట్సాప్‌ గ్రూపులకు యాప్‌లు, ఆఫర్లు, సినిమాలు, గేమ్స్‌ అంటూ లింక్‌లు పెట్టి డేటా దోచేసే ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త ప్రకటనలతో వచ్చే లింక్‌ను క్లిక్‌ చేస్తే.. ఫోన్‌లోని సమాచారం చోరీ అవుతోంది.

ఇన్‌స్టాల్‌ పేరుతో ఆయా లింక్‌లను క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌కు అనుమతిస్తే వెంటనే మన ఫోన్‌ సైబర్‌ నేరస్తుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. లా ఫోన్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల సర్వర్‌లోకి చేరుతోంది. ఆ డేటాను ఉపయోగించుకుని మన మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఉంటే మనకు తెలియకుండానే డబ్బులు లాగేయడం, వ్యక్తిగతమైన ఫొటోలు, వీడియోలు చిక్కితే న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు అంటూ డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేయడం, మన కాంటాక్ట్స్‌కు కాల్‌చేసి డబ్బులు అడగడం వంటి మోసాలు చేసేందుకు అవకాశం ఉంది.
- సాక్షి, అమరావతి

సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దు
సోషల్‌ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో కొద్ది రోజులుగా పింక్‌ వాట్పాప్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి లింక్‌లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వాటిని క్లిక్‌ చేసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దు. మనకు తెలియని, అవగాహన లేని లింక్‌లను తెరిస్తే ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉంది. వీటిపై ఇప్పటివరకు మా పరిధిలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయినా ఇటువంటి లింక్‌ల పట్ల సోషల్‌ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.
- బి.రాజారావు,  సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ, విజయవాడ

మరిన్ని వార్తలు