ఈ–పంటతోపాటే ఈ–కేవైసీ నమోదు

25 Jul, 2022 03:27 IST|Sakshi

ఆర్బీకేలతో రెవెన్యూ గ్రామాల అనుసంధానం

వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా ఈ–పంట నమోదుకు శ్రీకారం

జాయింట్‌ అజమాయిషీ ద్వారా పంట వివరాల నమోదు

పంటల నమోదులో మరిన్ని సంస్కరణలు

సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలవల్ల పంట కొనుగోలు.. సంక్షేమ పథకాల వర్తింపు విషయంలో ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ–పంట ఆధారంగానే వైఎస్సార్‌ రైతుభరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, దీని ప్రామాణికంగానే పంట ఉత్పత్తులను కనీస మద్దతుకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతుభరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌) గడిచిన రబీ సీజన్‌లోనే నవీకరణ (అప్డేట్‌) చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. దీంతో పంట వివరాల నమోదు ఒకసారి, ఈకేవైసీ నమోదు మరోసారి చేసేవారు. ఈ విధానంవల్ల పంట కొనుగోలు ఇతర పథకాల అమలు సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ ఇక నుంచి పంట వివరాల నమోదు సమయంలోనే ఈకేవైసీ (వేలిముద్రలు) తీసుకోవాలని నిర్ణయించారు.

వెబ్‌ల్యాండ్‌ ఆధారంగానే ఈ–క్రాపింగ్‌
వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా పంట సాగు వివరాలతోపాటు రైతు బ్యాంకు, సామాజిక వివరాలను కూడా అనుసంధానిస్తున్నారు. తొలుత ఆధార్‌ నెంబర్‌ కొట్టగానే రైతుల వ్యక్తిగత వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఆ తర్వాత సీజన్‌లో అతను సాగుచేసే పంట వివరాలు నమోదుచేస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఈకేవైసీ నమోదుచేస్తారు. ఇక ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది జాయింట్‌ అజమాయిషీ ద్వారా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు నెలాఖరు వరకు జాయింట్‌ అజమాయిషీ కొనసాగిస్తారు.

రబీ సీజన్‌లో అక్టోబర్‌ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు, మూడో పంటకు సంబంధించి మార్చి 1 నుంచి మే 31వరకు నిర్వహించనున్నారు. ఈ జాయింట్‌ అజమాయిషీలో తొలుత రెవెన్యూ గ్రామాలను ఆర్బీకేలతో అనుసంధానిస్తారు. ఆ తర్వాత వీఆర్వో, గ్రామ సర్వేయర్లు (రెవెన్యూ)తో పాటు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో బృందాలను ఏర్పాటుచేస్తారు. వారికి మండల స్థాయిలో శిక్షణనిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల వారీగా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో నమోదు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే సంబంధిత రైతు వేలిముద్రలు (ఈకేవైసీ) కూడా నమోదుచేసి రశీదు ఇస్తారు.

పంట వివరాల నమోదుకు మార్గదర్శకాలు
పరిష్కారంకాని ఇనాం, ఎస్టేట్, సర్వేకాని గ్రామాల్లోని భూములు, చుక్కల భూములు, పీఓటీ ఉల్లంఘనలు, దేవదాయ, వక్ఫ్, సీజేఎఫ్‌ఎస్, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములు, సాదాబైనామా కేసులు, మ్యుటేషన్‌ కోసం పెండింగ్‌లో ఉన్న భూములు, సీసీఆర్సీ కార్డుదారులు, నమోదుకాని కౌలుదారులు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న వారు, ఏపీఐఐసీ/ఏలినేటెడ్, సేకరించిన భూములు, వాటర్‌ బాడీలకు చెందిన భూములు, లంక భూముల్లో సాగుచేస్తున్న పంటల వివరాల నమోదుకు మార్గదర్శకాలు జారీచేశారు. నమోదైన ఈ–పంట వివరాలను మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు విధిగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి. సెప్టెంబర్‌ 1 నుంచి 14వరకు ఈ–పంట, ఈకేవైసీ వివరాలను విధిగా ఆర్బీకేలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సెప్టెంబర్‌ 15న ఆర్బీకే అండ్‌ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ఈ పంట వివరాలను తుది జాబితాలను ప్రచురించాలి.

పకడ్బందీగా పంటల నమోదు
కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు సాంకేతిక లోపాలతో ఇబ్బందిపడకూడదన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాయింట్‌ అజమాయిషీ ద్వారా రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బంది సంయుక్తంగా ఈ–పంటతో పాటు ఈకేవైసీ ఒకేసారి నమోదు చేయనున్నారు. వివిధ రకాల ప్రభుత్వ, ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న పంట వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో మార్గదర్శకాలిచ్చాం.  
 – పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్‌ వ్యవసాయ శాఖ  

మరిన్ని వార్తలు