పోలవరం: ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించం

3 Dec, 2020 00:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం సభను స్పీకర్‌ తమ్మినేని సీతారాం రేపటికి వాయిదా వేశారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించమని సీఎం స్పష్టం చేశారు. దివంగత నే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామని తెలిపారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆపకూడదని తపన ఉందని, పోలవరం నిర్మాణంలో ఆర్‌అండ్‌ఆర్‌పైన ప్రత్యేక దృష్టి పెడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సభాముఖంగా తెలిపారు.

9మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
వరుసగా మూడో రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పెద్ద ఎత్తన నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకు రావడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం...తొమ్మిదిమంది టీడీపీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. అయితే సస్పెండ్ అయిన వారితో పాటు చంద్రబాబు నాయుడుతో సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్లిపోయారు.

ఏపీ జీవనాడి పోలవరం: బుగ్గన
ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పట్టిసీమను తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. పోలవరంలో భాగం అయిన పట్టిసీమ కోసం అదనంగా ఖర్చు పెట్టారని ఆరోపించారు.


టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తాం: మంత్రి అనిల్‌
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వాపోయారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్‌ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశామన్నారు. పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై రాష్ట్ర తరపున వాదనలు వినిపించామని వెల్లడించారు. పోలవరాన్ని వైఎస్సార్‌ ప్రారంభిస్తే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తున్నారని చెప్పారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహానిస్తామన్నారు.

కీలక బిల్లులు ఆమోదం
ఏపీ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ థర్డ్‌ అమైన్‌మెంట్‌ను బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. యానిమల్‌ ఫీడ్‌, క్వాలిటీ కంట్రోల్‌ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. మంత్రి సీదిరి అప్పలరాజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ స్టేట్‌ డెపలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, వ్యవసాయ భూముల (వ్యవసాయేతర అవసరాల మార్పిడి) సవరణ బిల్లు-2020 (ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ (కన్వర్షన్‌ నాన్‌ అగ్రికల్చరల్‌ పర్పస్‌) అమెండ్‌మెంట్‌ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.


చారిత్రక బిల్లు: కన్నబాబు
అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదో చారిత్రక బిల్లు అని, రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. దేశానికి వెన్నముఖగా నిలిచిన వ్యవసాయ రంగానికి కౌనిల్స్‌ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు విషయంలో ఏపీ ముందుడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చమన్నారు. ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుం‍దని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి వారధిగా అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఉంటుందన్నారు.అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ద్వారా రైతులకు విలువైన సూచనలు అందుతాయని.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దీని పరిధిలో ఉంటాయన్నారు. వ్యవసాయ పట్టభద్రులను ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు అనుమతిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామనితెలిపారు.


రాష్ట్రానికి మంచి జరుగుతుంది: కాపు
ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ డ్యూటీ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లు చదవకుండా ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులకు పగటిపూట నాణ్యమైన కరెంట్‌ ఇవ్వాలంటే సౌర విద్యుత్‌ తప్పనిసరి అన్నారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి, రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. టీడీపీ నాయకులు కుట్రపూరితంగా మంచి పనులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు.


అందుకే ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు: బుగ్గన
నాణ్యమైన విద్యుత్‌తోపాటు 24 గంటల కరెంట్ కోసమే ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. చంద్రబాబు విద్యుత్‌ రంగాన్ని నష్టాల్లోకి నెట్టారని,  రెండు రూపాయలకు విద్యుత్‌ దొరికే అవకాశం ఉన్నా.. రూ.4.80 పైసలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్‌ చేసుకున్నారని తెలిపారు. 4 వేల మెగావాట్లకు తాము యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకున్నామని వెల్లడించారు. సౌర విద్యుత్‌ను తానే కనిపెట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరారు. ఈ బిల్లుతో పేదలకు మేలు జరుగుతుందని, భూమిని స్వచ్ఛందంగా లీజుకిచ్చేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు. లీజుకిచ్చిన ఎకరం భూమికి రూ.25 వేలు ఇస్తామన్నారు. పేదలకు మంచి జరిగే కార్యక్రమానికి చంద్రబాబు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. అయితే బుగ్గన చెప్పివన్నీ అవాస్తవాలని అచ్చెన్నాయుడు అన్నారు.


మంచి నిర్ణయం: ధర్మశ్రీ
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు సీఎం జగన్‌ 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారని అన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లులో అనేక మంచి అంశాలు ఉన్నాయని, ఈ బిల్లును సమర్థించాలని కోరారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో11 బిల్లులు  చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ సంక్షేమ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు