ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

3 Dec, 2020 09:04 IST|Sakshi

సీఎం జగన్‌పై జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు
పేదల పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాసినక పరిస్థితి సరిగా లేదని విమర్శించారు. పెన్షన్ల  గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్‌కు, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌కే ఉందన్నారు. ‘జగన్‌లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం. పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్‌ఆర్‌.. ఇప్పుడు జగనే. సీఎం జగన్‌ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వలంటీర్లను నియమించారు. వలంటీర్‌ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ ఆలోచన అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇళ్ల కోసం పేదలు ఇంతకుముందు ఎమ్మెల్యేల ఇంటి ముందు బారులు తీరేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే పేదల కోసం సీఎం జగన్‌ లక్షల ఇళ్లు ఇస్తున్నార’ని రాపాక వరప్రసాద్‌ అన్నారు.


టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
నాలుగోరోజు టీడీపీ సభ్యులు శాసనసభలో గందరగోళం సృష్టించారు. ఎమ్మెల్యే పి.రాజన్నదొర మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలింగించారు. దీంతో వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులతో పాటు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.


రామానాయుడిపై సీఎం జగన్‌ ఆగ్రహం
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని, పదే పదే అబద్దాలు చెప్పేవారికి మాట్లాడే అవకాశం​ ఇవ్వొద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాల ఆధారంగా రామానాయుడిపై చర్య తీసుకుంటామని స్పీకర్‌ సభలో ప్రకటించారు. సభలో వాస్తవాలు చెప్పాలని సభ్యులకు సూచించారు. రికార్డ్ నుంచి రామానాయుడు వాఖ్యలు తొలగించాలని స్పీకర్ ఆదేశించారు.


చంద్రబాబు ఫేక్‌ ప్రతిపక్షనేత: కొడాలి నాని
పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసునని, చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయారు.. కరోనా రాగానే కాల్వగట్టు నుంచి హైదరాబాద్‌కు పారిపోయార’ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫేక్‌ ప్రతిపక్షనేత, టీడీపీ ఫేక్‌ పార్టీ అని ధ్వజమెత్తారు. పొత్తు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేరని ధ్వజమెత్తారు.

పేదల అభివృద్ధే లక్ష్యంగా పాలన: ధర్మాన
పేదల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఏడాదిన్నరలో సంక్షేమ పథకాల ద్వారా రూ.67వేల కోట్లు అందించామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ... ఒక్క కుటుంబానికి కూడా కన్నీళ్లు లేకుండా సంక్షేమం అందించారని ప్రశంసించారు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాలు ఆపలేదని, లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడే వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఏ పథకానికి ఎవరు అర్హులో గుర్తించడమే పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.


భూ హక్కుల యాజమాన్య బిల్లుకు ఆమోదం
భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడమే లక్ష్యంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లు ప్రవేశపెట్టినట్టు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఈ బిల్లుతో భూ వివాదాలకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రెవెన్యూ చట్టాలను సంస్కరించి తయారు చేసిన ఈ బిల్లుతో భూ వివాదాలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను అభిప్రాయపడ్డారు. చర్చ తర్వాత ఏపీ భూ హక్కుల యాజమాన్య బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపీ మున్సిపల్‌ లా సెకండ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై చర్చించిన తర్వాత సభ ఆమోదం తెలిపింది.

టీడీపీ సభ్యుల గందరగోళం
దిశా చట్టం సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. తమ​కు మాట్లాడే ఇవ్వాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. ఎవరెవరు మాట్లాడతారో ముందుగా తన లిస్టు పంపించకుండా ఇలా మధ్యలో అడగడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్‌ వివరణయిచ్చారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేశ్‌.. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల నడుమ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. కాసేపు సభకు అడ్డం పడి సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.


దిశా చట్టానికి 4 జాతీయ అవార్డులు: సుచరిత
గతంలో చేసిన దిశా చట్టానికి సవరణలు చేసి తాజాగా శాసనసభలో పెట్టారు. సవరణ బిల్లుపై హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశా చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, విచారణ వేగవంతం కోసం డీఎస్పీస్థాయి అధికారిని నియమించినట్టు చెప్పారు. తిరుపతి, మంగళగిరి, విశాఖలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దిశా చట్టానికి జాతీయస్థాయిలో 4 అవార్డులు వచ్చాయన్నారు. దిశా చట్టంతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని విశ్వాసం చేశారు. దిశా చట్టం వచ్చాక 3 కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయని వెల్లడించారు. దిశ యాప్‌ను లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మంత్రి ప్రసంగం తర్వాత దిశా చట్టసవరణ బిల్లును సభ ఆమోందించింది.

ఎలక్ట్రిసిటీ డ్యూటి బిల్లు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏపీ విద్యుత్‌ సుంకం సవరణ(ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటి అమెంట్‌మెంట్‌) బిల్లుపై చర్చకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అంగీకరించారు. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించారు. మంత్రి ప్రసంగం తర్వాత బిల్లు సభ ఆమోదం పొందింది. తర్వాత దిశా చట్టంపై చర్చ ప్రారంభమైంది. నగదు బదిలీ, కరోనా కట్టడిపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా, మీడియా, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు అరికట్టాలంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు.

ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై శాసన సభలో చర్చించనున్నారు. శాసన మండలిలో నేడు 9 బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలపై శాసన మండలి చర్చించనుంది.

మరిన్ని వార్తలు