ఆరుబయట జీవనం.. అనాథలుగా మరణం! 

16 Oct, 2022 09:41 IST|Sakshi

రాయదుర్గం: నా అనే వారు లేక దీన స్థితిలో కాలం వెళ్లదీస్తూ కొందరు... అయినవాళ్లందరూ ఛీదరించుకుని గెంటేస్తే రోడ్డున పడిన మరికొందరు వృద్ధాప్యంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య పొత్తిళ్లలో నుంచి కాపాడుకుంటూ వచ్చి, విద్యాబుద్ధులు చెప్పించి, జీవితంలో ఓ స్థాయికి ఎదిగేలా చేసిన తల్లిదండ్రులను కొందరు నిర్దాక్షిణ్యంగా రోడ్డున వదిలేస్తున్నారు.

దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల పక్కనే అనాథలుగా జీవనం సాగిస్తూ.. చివరకు అనాథలుగానే మృతి చెందుతున్నారు. ఈ మూడేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 42 మంది అనాథలుగా మృతిచెందారు. ఇందులో 15 మృతదేహాల ఆచూకీని పోలీసులు గుర్తించి సంబందీకులకు అప్పగించారు. మరో 27 కేసుల్లో మృతుల కుటుంబసభ్యులు ఎవరైంది ఆచూకీ చిక్కడం లేదు.  

ఇతని పేరు జి.గోవిందు. డి.హీరేహాళ్‌ మండలం గొడిశెలపల్లి. వివిధ కారణాలతో తల్లిదండ్రులు, సోదరి, సోదరులు మృతి చెందారు.  ఒంటరిగా జీవనం సాగిస్తున్న అతనికి బళ్లారికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. ఇటీవల అంతు చిక్కని వ్యాధితో గోవిందు సతమతమవుతున్నాడు. కాలుకు ఇన్‌ఫెక్షన్‌ సోకి వేళ్లు తెగిపోయాయి. ఈ క్రమంలో కుటుంబపోషణ భారం కావడంతో 15 ఏళ్ల క్రితం అతణ్ని వదిలేసి పాపతో కలసి భార్య వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో అతని పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అద్దె చెల్లించలేక ఇల్లు ఖాళీ చేసి నడిరోడ్డుపైకి చేరుకున్నాడు. గ్రామంలోని బస్‌ షల్టర్‌లో ఉంటూ ఇరుగుపొరుగు వారు అందించే    ఆహారంతో బతుకు నెట్టుకొస్తున్నాడు.  

మీరు చూస్తున్న ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు ఈరమ్మ. కర్ణాటకలోని బళ్లారి జిల్లా గోనేహాళ్‌ గ్రామం. అనంతపురం జిల్లా రామగిరి, బొమ్మనహాళ్‌ ప్రాంతాల్లో సమీప బంధువులున్నారు. ఈ నెల 4న బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు క్రాస్‌ వద్ద ఆమె మృతి చెందింది. అంతకు ముందు 20 రోజులుగా అక్కడే చావుబతుకుల మధ్య ఆమె కొట్టుమిట్టాడింది. అయినవాళ్లు అందరూ ఉన్నా.. చివరకు అనాథగా కన్ను మూయడంతో గ్రామ నౌకర్ల సాయంతో అధికారులు అంత్యక్రియలు పూర్తి చేయించారు.

  
మీరు చూస్తున్న ఈ చిత్రం రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోనిది. కొంతకాలంగా రాయదుర్గం – భైరవాని తిప్ప ప్రాజెక్ట్‌ ప్రధాన రహదారిలోని రింగ్‌ రోడ్డు వద్ద ఒంటరిగా నివసిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 6న ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. అప్పటికే మృతదేహం కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల నివాసముంటున్న వారు మృతదేహాన్ని బయలు ప్రాంతానికి మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి వెంటనే పారిశుద్ధ్య కారి్మకులను పంపి         ఆ మృతదేహన్ని ఖననం చేయించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఎవరైంది ఇప్పటి వరకూ పోలీసులు గుర్తించలేకపోయారు.

భరోసానివ్వాలి
అనాథలుగా ఏ ఒక్కరూ జీవించేందుకు వీల్లేదు. నిజంగా ఎవరైనా అనాథగా గుర్తింపబడితే వెంటనే వారిని ఆదరించడం మానవధర్మం. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత బిడ్డలపై ఉంది. దగ్గరుండి వారి అవసరాలను తీర్చాలి. మేమున్నామంటూ భరోసానివ్వాలి. అలా కాదని భారంగా భావించి రోడ్లపై వదిలేయడం సరైన పద్ధతి కాదు. ఆఖరి క్షణాల్లో వారు అనుభవించే బాధను ఆలోచించాలి.      
– ఎస్‌.నాగలక్ష్మీ, కలెక్టర్‌ 

కఠిన చర్యలు తీసుకుంటాం
తల్లిదండ్రులను కేవలం వ్యక్తులుగా కాకుండా సమాజ మార్గదర్శకులుగా చూడాలి. వారి అనుభవాలు మన జీవిత గమనాన్ని మారుస్తాయి. అలాంటి దేవతామూర్తులను ఆఖరి క్షణాల్లో ఆరుబయట వదిలేయడం దారుణం. అయినవాళ్లందరూ ఉండి అనాథగా మరణిస్తున్నారంటే అది మానవ జన్మకే సిగ్గుచేటు. శిశువుగా పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకూ పోషించడంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకోవాలి. మలిదశలో వారిని సేవించడాన్ని అదృష్టంగా భావించాలి. కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్లపాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
– డాక్టర్‌ ఫక్కీరప్ప, ఎస్పీ    

(చదవండి: ఊపిరిపీల్చుకున్న ‘అనంత’)

మరిన్ని వార్తలు