హార్బర్ల నిర్మాణంతో మారనున్న తీరం ముఖచిత్రం

22 Nov, 2020 02:57 IST|Sakshi

5,900 మర పడవలకు అదనంగా లంగరు సౌకర్యం 

2.37 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద లభ్యం 

1.18 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి  

అదనంగా రూ.500 కోట్ల ఆదాయం 

పెరగనున్న ప్రజల జీవన ప్రమాణాలు   

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా తీర ప్రాంతం సంపదకు నెలవుగా, ఉపాధికి కల్పతరువుగా మారనుంది. ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ది చెందనుంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా సముద్రంలో చేపల వేటకు వెళ్లే పడవలు, వేట ముగించుకుని ఒడ్డుకు వచ్చే పడవలతో తీర ప్రాంతం సందడిగా మారనుంది. మత్స్య సంపదను నిల్వచేసే కోల్డు స్టోరేజి ప్లాంట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు అక్కడ ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచే దేశ విదేశాలకు మత్స్య సంపదను ఎగుమతి చేసే సంస్థలు వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి. రూ.1,510 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 హార్బర్ల వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.

రాష్ట్ర ప్రభుత్వ అంచనాల మేరకు కొత్తగా 5,900 మర పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో పడవలకు అవసరమైన డీజిల్, ఐస్‌ను హార్బరులోనే కొనుగోలు చేయవచ్చు. గత ప్రభుత్వం ఈ హార్బర్లను నిర్లక్ష్యం చేయడంతో మర పడవల నిర్వాహకులు తీరం నుంచి 10 – 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో డీజిల్, ఐస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు హార్బర్లలోనే పెట్రోల్‌ బంకులు, ఐస్‌ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో నిర్వాహకులకు ఆ సమస్యలు తప్పుతాయి.

పెరిగిన మర పడవల కారణంగా సాలీనా 2,37,350 టన్నుల మత్స్య సంపద అదనంగా లభ్యమవుతుందని నిపుణుల అంచనా. దీని వల్ల సాలీనా రూ.500 కోట్లకు పైగా ఆదాయం పెరగనుంది. వీటిన్నింటిపై ఆధారపడి జీవించే 1,18,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. చేపల వేట, అమ్మకాలు, ప్రాసెసింగ్, క్రయ విక్రయాల్లో కార్మికులకు విస్తారంగా అవకాశం లభిస్తుంది. 20 నుంచి 40 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన ఐస్‌ ప్లాంట్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉండటంతో 2,240 టన్నుల ఐస్‌ అక్కడ అందుబాటులో ఉంటుంది.  

మీ మేలు మరవలేం
నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని మీరు పాదయాత్రలో అన్నారు. సీఎం కాగానే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. తక్కువ టైంలో మా చేతికి రూ.10 వేల సాయం అందింది. మీరు చిన్న కర్ర తెప్పలను కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.10 వేలు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం. గతంలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఎవరైనా వేటకు వెళ్లి మరణిస్తే అందించే సాయాన్ని ఏకంగా రూ.10 లక్షలు చేశారు. పాకిస్తాన్, గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను రప్పించిన మీ మేలు మరవలేం. మంచినీళ్లు పేట దగ్గర జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మత్స్యకారులం అందరం మీకు రుణపడి ఉంటాం. ఎల్లకాలం మీరే సీఎంగా ఉండాలి.     
– లక్ష్మయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట, శ్రీకాకుళం.

ఏ ప్రభుత్వం ఇలా మేలు చేయలేదు
మీరు ఆక్వా కల్చర్‌లో అన్ని అంశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ.. ఆక్వాకల్చర్‌ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మా సమస్యలన్నింటికి పరిష్కారం కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ చూడనంత తీవ్రంగా, తీక్షణంగా మీరు మా సమస్యను చూసి పరిష్కరిస్తున్నారు. గతంలో ఇంత మేలు ఎప్పుడూ జరగలేదు. యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 చొప్పున ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకరకంగా ఈ రోజు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు మీరే కారణం. కోవిడ్‌ సమయంలోనూ మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్నారు. ఆక్వా హబ్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, జనతా బజార్లు మా తల రాతలను మారుస్తాయనడంతో సందేహం లేదు.     
– కనుమూరి ప్రసాద్, గుడివాడ, కృష్ణా జిల్లా 

మరిన్ని వార్తలు