లాక్‌డౌన్‌లోనూ ఎంఎస్‌ఎంఈలకు విరివిగా రుణాలు

1 Nov, 2020 04:53 IST|Sakshi

ఏప్రిల్‌–జూన్‌ కాలంలో రూ.15,303.71 కోట్ల రుణాల మంజూరు

ఏడాది లక్ష్యంలో మూడు నెలల్లోనే 38.65% చేరుకున్న బ్యాంకులు

లక్ష్యం కంటే అధికంగా రుణాలు ఇచ్చిన విజయనగరం జిల్లా

అతి తక్కువ రుణాలతో దిగువ స్థానంలో ఉన్న తూర్పుగోదావరి

ఎస్‌ఎల్‌బీసీ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రకటించిన లాక్‌డౌన్‌ కష్ట సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లను ఆదుకోవడానికి బ్యాంకులు ముందుకువచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలంలో రూ.1,5,303.71 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.39,599.77 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా తొలి మూడు నెలల్లోనే 38.65% లక్ష్యాన్ని చేరుకున్నట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఎంఎస్‌ఎం రంగాన్ని ఆదుకోవడానికి రుణాలకు బ్యాంక్‌ గ్యారంటీగా రూ.200 కోట్లు కేటాయించడంతో బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారంటీ స్కీంని వినియోగించుకోవడంలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ స్కీం కింద అక్టోబర్‌ 5వ తేదీ నాటికి రూ.4,421.76 కోట్ల విలువైన రుణాలను ఎంఎస్‌ఎంఈలకు మంజూరు చేశాయి.

లక్ష్యాన్ని మించిన  విజయనగరం
ఎంఎస్‌ఎంఈ రుణాల మంజూరు విషయంలో విజయనగరం జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం మీద రూ.810 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొలి మూడు నెలల్లోనే లక్ష్యాన్ని మించి రూ.1,145.38 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అంటే లక్ష్యానికి మించి 141.40% రుణాలను మంజూరు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ.4,912.36 కోట్ల రుణాల లక్ష్యం కాగా మూడు నెలల్లో కేవలం రూ.845.81కోట్ల రుణాలను మాత్రమే మంజూరు చేసింది. నిర్దేశిత లక్ష్యంలో 17.22% మాత్రమే మంజూరు చేయడం ద్వారా చివరి స్థానంలో నిలిచింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు