వేడెక్కుతున్న ‘పుర’ రాజకీయం

24 Feb, 2021 08:42 IST|Sakshi

అమరావతి బ్యూరో: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో జిల్లాలోని రెండు నగరాలు, ఐదు పట్టణాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. రాజకీయంగా ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అన్ని పార్టీలు తమ ప్రాతినిధ్యం కోసం ఆరాటపడుతున్నాయి. 2014 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో పదవులపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు నూజివీడు, పెడన మున్సిపాలిటీలకు, నందిగామ, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. గతేడాది నామినేషన్ల ఉపసంహరణ దశలో ప్రక్రియ వాయిదా పడింది. ఏడాది తర్వాత మళ్లీ ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభమైంది. దీంతో నిన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టి ఉన్న నాయకులు, ఇప్పుడు పట్టణాల్లో డివిజన్లు/వార్డు స్థానాలపై ఫోకస్‌ పెట్టారు. చైర్మన్‌ పదవులను దక్కించుకునేందుకు ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యూహరచన చేస్తున్నారు.  

1,719 నామినేషన్లు..  
జిల్లాలో నగరపాలిక, పురపాలక సంఘాల్లో మొత్తం 1,719 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలనలో 88 తిరస్కరించారు. ఎన్నికల సంఘం తాజా ప్రకటనను అనుసరించి మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు అవకాశం కలి్పంచారు. జిల్లాలోని 229 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అన్నింటిలో రెండు, అంతకు మించి నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుతం అన్ని డివిజన్లు/వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపసంహరణ రోజుకు ఏకగ్రీవాలకు ప్రయతి్నంచాలని అధికారపార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది.   

అధికారపార్టీ వారివే ఎక్కువ నామినేషన్లు..  
ప్రస్తుతం దాఖలైన నామినేషన్లలో అధికారపారీ్టకి చెందిన వారివే ఎక్కువగా ఉన్నాయి. ఉపసంహరణ రోజు వీటిపై స్పష్టత రానుంది. జిల్లాలో 229 స్థానాలకు దాఖలైన నామినేషన్లలో వైఎస్సార్‌ సీపీ 622 నామినేషన్లు, టీడీపీ 516, మూడో స్థానంలో ఇతరులు 285 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తర్వాతి స్థానాల్లో జనసేన 142, బీజేపీ 91, కాంగ్రెస్‌ పార్టీ 63 నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఉపసంహరణపై ఉత్కంఠ..  
కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ స్థానాలకు అధికార పక్షం నుంచి ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసినా.. ఉపసంహరణ నాటికి విజయావకాశాలున్న అభ్యర్థులనే బరిలో నిలిపే దిశగా చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు ఇతర మున్సిపాలిటీల్లోనూ ఈ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నాయకులు కూడా అధికార పక్షానికి దీటుగా ఎన్నికలు ఎదుర్కోవడం ఎలా అనే విషయంలో వ్యూహాలు  రచిస్తున్నారు. పారీ్టలోని ముఖ్యనాయకుల ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి పుర ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు జనసేన, బీజేపీ నాయకులు యత్నిస్తూ.. కొన్ని డివిజన్‌/వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.  
 

మరిన్ని వార్తలు