Mysterious Sounds: ఆ గ్రామాల్లో వింత శబ్ధాలు.. వణికిపోతున్న ప్రజలు..

5 Dec, 2021 08:46 IST|Sakshi
ఓటేరుపాళెం సమీపంలోని బండలపై ఉంటున్న గ్రామస్తులు

మొన్న కరిడిమొడుగు, నిన్న ఓటేరుపాళెంలో..

 ఇప్పటికీ బండలపైనే గడుపుతున్న గ్రామస్తులు

భూమిలో నుంచి రకరకాల శబ్దాలు

పలమనేరు: పల్లెల్లో ఎన్నడూ లేనివిధంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి వచ్చిన కాసేపటికి భూమి అదిరినట్లు అవుతోంది. దీంతో ఎప్పుడేమి జరుగుతుందోననే భయంతో గ్రామీణ ప్రజలు సమీపాల్లోని అడవుల వద్ద ఉన్న వెడల్పాటి బండలపై గడుపుతున్నారు. పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాల సరిహద్దుల్లో కౌండిన్య అడవికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలోనే ఎందుకు శబ్దాలు వస్తున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ..

తొలుత కరిడిమొడుగులో.. 
నాలుగు రోజుల క్రితం పలమనేరు మండలం కరిడిమొడుగు, సంబార్‌పూర్, నలగాంపల్లి ప్రాంతాల్లో వింతశబ్దాలు వినపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆపై తల తిరిగినట్లైందని, ఇళ్లలోని వస్తువులు కిందపడినట్లు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలోని బైరెడ్డిపల్లి మండలంలో నెల్లిపట్ల పంచాయతీ కౌండిన్య అడవికి ఆనుకుని ఉంటుంది. రెండురోజుల క్రితం ఓటేరుపాళెం, నల్లగుట్లపల్లి, తిమ్మయ్యగారిపల్లి, ఎస్సీకాలనీ గ్రామాల్లోనూ వింత శబ్దాలు వచ్చాయి. గంటకోసారి, అరగంటకోసారి శబ్దాలు రావడంతో ఇంటి గోడలకు బీటలు పడడం, కళ్లు తిరిగినట్లు కావడంతో ఆ గ్రామాల ప్రజలు సమీపాల్లోని బండలపైకి వెళ్లారు. మండలంలోని పలుశాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి వెళ్లాక కూడా శబ్దాలు వస్తుండడంతో విధి లేక గ్రామీణులు గురువారం రాత్రి సైతం బండలపైనే జాగారం చేశారు.

చదవండి: వైరల్‌: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా.. 

ఈ ప్రాంతంలోనే ఎందుకిలా.. 
కౌండిన్య అడవికి సమీపంలోని ఏడు గ్రామాల్లోనే ఇలా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏడాది క్రితం 700 నుంచి 1200 అడుగుల దాకా వ్యవసాయబోర్లు డ్రిల్‌ చేస్తే గానీ గంగ జాడ కనిపించేంది కాదు. ఇటీవల ఈ ప్రాంతంలోనే వర్షాలు ఎక్కువ కురిశాయి. దీంతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. దీంతో గతంలో భూమిలోపల ఖాళీగా ఉన్న పొరల మధ్య నీరు చేరడంతో అక్కడ ఏర్పడే ప్రకంపకనలతో భూమిలో నుంచి వచ్చే శబ్దాలు పైకి భయంకరంగా వినిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. సంబంధిత శాఖలైన భూగర్భజలాలు, భూకంపాలను పరిశీలిందే సిస్మోగ్రాఫర్లు ఈ ప్రాంతానికి వచ్చి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈవిషయమై పలమనేరు తహసీల్దార్‌ కుప్పుస్వామిని వివరణ కోరగా ఆ గ్రామాల్లో శబ్దాలు వస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే భూమిలోపలి పొరల్లో నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయని, సంబంధిత నిపుణులు పరిశీలించాక గానీ దీనిపై ఓ స్పష్టత రాదన్నారు.

మరిన్ని వార్తలు