మరోసారి లాక్‌డౌన్‌ దిశగా.. యంత్రాంగం చర్యలు

8 Aug, 2020 07:02 IST|Sakshi

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు 

లాక్‌డౌన్‌ ద్వారా కరోనాకు చెక్‌ 

ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న యంత్రాంగం 

సాక్షి, ఒంగోలు ‌: ఒంగోలు నగరంలో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ ద్వారానే కరోనా కేసులకు చెక్‌ పెట్టవచ్చన్న ఉద్దేశంతో యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. రెండు వారాలపాటు నగరంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి స్పష్ట్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి. నిత్యావసరాలకు సంబంధించి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకే అనుమతి ఇవ్వనున్నారు. అత్యవసరమైన మందుల దుకాణాలు, పెట్రోలు షాపులు తెరుస్తారు. 

బయటకు వస్తే బాదుడే... 
ఒంగోలు నగర ప్రజలు కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో నగర ప్రజలు మాత్రం ఎలాంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకుండా వీధుల్లో గుంపులు గుంపులుగానే తిరుగుతున్నారు. ఉదయం పూట అయితే టీ దుకాణాల వద్ద ఎలాంటి మాస్క్‌లు లేకుండా గంటల తరబడి గుంపుగా కూర్చొని మాట్లాడుకోవడం పరిపాటిగా మారింది. బయటకు వచ్చే సమయంలో మాస్క్‌ ధరించాలన్న ఆలోచన చేయడం లేదు. ఇక శానిటైజర్‌ వంటి వాటిని వినియోగిస్తున్న దాఖలాలు కూడా లేవు. కొంతమంది నిర్లక్ష్యం ఇతరులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కరోనా బారిన పడ్డారంటే దాని తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది నిర్లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విధించనున్న లాక్‌డౌన్‌లో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. నిర్ణయించిన గడువు తర్వాత ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. పోలీసులు గట్టిగా పహారా కాస్తూ ఎవరైనా బయట కనిపిస్తే లాఠీలకు పని చెప్పేందుకు కూడా వెనుకాడకుండా ఉత్తర్వులు వెలువడనున్నాయి.  (మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు కరోనా)

రెండు వేలకు పైగా కేసులు: 
ఒంగోలు నగరంలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడటం లేదు. నగరంలో అనధికారికంగా రెండు వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే కరోనా కేసులు వెయ్యి దాటిపోయాయి. దాంతో ఒంగోలు నగరం మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అంతేగాకుండా కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ వ్యాపార వర్గాల నుండి ఒత్తిళ్లు అధికం కావడంతో వాటిని సడలించాల్సి వచ్చింది. దాంతో నగరంలోని వ్యాపార కూడళ్లు మొత్తం తిరునాళ్లను తలపిస్తున్నాయి. ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటూ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ సమయంలో కరోనాకు సంబంధించి ఎలాంటి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. దాంతో కరోనా బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  (కిరణ్‌ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే శ్రీదేవి)

మరణాలు సంభవిస్తున్నాయి: 
ఒంగోలు నగరంలో కరోనా అత్యంత ప్రమాదకరమైన థర్డ్‌ స్టేజీలో ఉంది. కరోనా లక్షణాలు బయటకు కనిపించకుండానే ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది. కరోనా ప్రారంభ దశలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించేవి. అయితే ప్రస్తుతం ఆ లక్షణాలేమీ లేకుండా ఆరోగ్యవంతులుగా బయటకు కనిపిస్తున్నప్పటికీ వారిలో కరోనా ఉంటోంది. దీనిని గుర్తెరగకుండా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఇదే క్రమంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడటం, గంటల వ్యవధిలో ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా ఒంగోలులో చోటు చేసుకున్నాయి. ఒంగోలు నగరంలో కరోనా మరణాలు సంభవిస్తున్న తరుణంలో ఆ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని యంత్రాంగం భావించి ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.  

మరిన్ని వార్తలు