ఎంపీ సుజనా చౌదరికి షాక్‌..

13 Nov, 2020 17:05 IST|Sakshi

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.520 కోట్లు ఎగ్గొట్టిన సుజనా

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అధికారులు షాకిచ్చారు. బ్యాంక్‌ కుంభకోణం కేసులో అతనిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేశారు. దీంతో అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. లుక్‌ అవుట్‌ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్‌ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు ఇచ్చింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. సుజనా చౌదరిపై 2018లోనే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. 2018లో సుజనా ఆస్తులను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేలానికి పెట్టింది. ఈ క్రమంలోనే ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరిలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు సైతం నిర్వహించింది. హైకోర్టులో సుజనాపై మారిషస్‌ బ్యాంకులు పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే షెల్‌ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్‌ చేసినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. 
 (వేలానికి సుజనా చౌదరి ఆస్తులు)

సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్, సుజనా మెటల్‌ ప్రొడక్ట్, సుజనా టవర్స్‌ లాంటి లిస్టెడ్‌ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్‌ కూడా లిస్టెడ్‌ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్‌ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్‌ అండ్‌ కాంప్ట్రాన్‌) మినహా మిగిలినవన్నీ షెల్‌ కంపెనీలే. ఇవి సర్క్యులర్‌ ట్రేడింగ్, బుక్‌ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా  గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. 
 

మరిన్ని వార్తలు