న్యాయ రాజధానిలో ‘లోకాయుక్త’ ప్రారంభం

29 Aug, 2021 03:25 IST|Sakshi
కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జస్టిస్‌ లక్ష్మణరెడ్డి

సేవలను సద్వినియోగం చేసుకోండి 

పోస్టు, మెయిల్‌తో పాటు వాట్సాప్, ఫోన్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం 

వాటిని విచారించి న్యాయం చేస్తామన్న లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి   

కర్నూలు (సెంట్రల్‌): లోకాయుక్త కార్యాలయాన్ని శనివారం కర్నూలులో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని మూడో గదిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి ప్రారంభించి.. తన చాంబర్‌లో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డికి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో బి.పుల్లయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జస్టిస్‌ లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజలు లోకాయుక్త గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్‌ వర్సిటీల్లో సీట్లు

ప్రజలు తమకు అన్యాయం జరిగినప్పుడు పోస్టు, మెయిల్‌ ద్వారా గానీ, లేదంటే వాట్సాప్, ఫోన్‌ ద్వారా తమ సమస్యను చెబితే చాలన్నారు. వాటిని విచారించి న్యాయం చేస్తామని తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో లోకాయుక్త కార్యాలయముండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో ఏపీలోని కోస్తాంధ్ర నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. అక్కడి ప్రజలు తమకు చిన్న సమస్య వచ్చినా కూడా లోకాయుక్తను ఆశ్రయించేవారన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు దీని గురించి సరైన అవగాహన లేకపోవడంతో.. ఫిర్యాదులు పెద్దగా వచ్చేవి కాదన్నారు. రాయలసీమ ప్రజలు కూడా లోకాయుక్త గురించి తెలుసుకొని న్యాయం పొందాలని కోరారు.  చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా

మొదటి రోజే ఫిర్యాదు.. 
కర్నూలులో కార్యాలయం ప్రారంభమైన మొదటి రోజే లోకాయుక్తకు ఒక ఫిర్యాదు అందింది. కోడుమూరు మండలం పులకుర్తికి చెందిన వరలక్ష్మమ్మ అనే వృద్ధురాలి నుంచి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి ఫిర్యాదును నేరుగా స్వీకరించారు. తమ గ్రామంలో దేవుడి మాన్యం ఆక్రమణలపై ఆమె ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో లోకాయుక్త రిజిస్ట్రార్‌ విజయలక్ష్మి, సెక్రటరీ అమరేందర్‌రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోలయ్య, ఆర్డీవో హరిప్రసాదు, కల్లూరు తహసీల్దార్‌ రమేష్‌బాబు, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిశేషునాయుడు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు