48 గంటల్లో హైకోర్టు నుంచి స్టే తెప్పించగలను 

13 Nov, 2021 07:54 IST|Sakshi
పోలీస్‌ వాహనాలను చూస్తూ మాట్లాడుతున్న లోకేశ్‌

సాక్షి, తిరుపతి: ‘చట్టం, న్యాయం మనవైపు ఉన్నాయి. 48 గంటల్లో హైకోర్టు నుంచి వ్యక్తిగతంగా స్టేలు తెప్పించగలను. నాపై 11 కేసులు పెట్టారు. 307 కేసు పెట్టినా ఏం పీక్కోలేకపోయారు..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం లోకేశ్‌ తీవ్రమైన, అసభ్యకరమైన పదజాలంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా ప్రచారం సాగించారు.

లక్ష్మీపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రచారం చేస్తుంటే వారి వైపు చేయి చూపిస్తూ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  అక్కడున్న పోలీసులవైపు చూస్తూ.. తన చొక్కా కాలర్‌ ఎగరేస్తూ మాట్లాడారు. చిత్తూరు ఎస్పీని, కుప్పం డీఎస్పీని హైకోర్టు ‘దా.. దా.. అంటూ రమ్మంది..’ అని ఎద్దేవా చేశారు. రేపు సీఐ, కానిస్టేబుళ్లను కూడా కోర్టు ‘దా.. దా.. అంటుందేమో’ అని పోలీసులను చులకన చేస్తూ మాట్లాడారు. ‘కరెంటు ఇవ్వలేని నా కొడుకులు కుప్పంలో ఓట్లెలా అడుగుతారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

టీడీపీ ప్రభుత్వం రాగానే డిస్మిస్‌ చేస్తాం 
రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో ఎస్పీపై ఐదారు ప్రైవేట్‌ ఫిర్యాదులున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వీరందరినీ  డిస్మిస్‌ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకుని పనిచేస్తే మంచిదన్నారు.

తన తండ్రి సీఎంగా ఉన్నన్ని రోజులు అమరావతిలో తన నివాసానికి ఎవరొచ్చినా గేట్లు తెరిచామని, అదే తాడేపల్లిలోని కొంపకు ఎంతమంది వెళ్లారంటూ స్థానికులను ప్రశ్నించారు. తన తండ్రి వయసున్న మంత్రి పెద్దిరెడ్డిని ‘వాడు, వీడు’ అంటూ సంబోధించారు. 

మరిన్ని వార్తలు