వినాయక ఉత్సవాలపై ఆంక్షలు సబబే 

9 Sep, 2021 02:39 IST|Sakshi

బహిరంగ ప్రాంతాల్లో మండపాలు, విగ్రహాల ఏర్పాటు వద్దు 

ప్రైవేట్‌ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు 

పూజలకు ఐదుగురి కంటే ఎక్కువ మందిని అనుమతించరాదు 

మండపాల వద్ద ప్రజలు గుమికూడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి 

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సహేతుక ఆంక్షలు విధించవచ్చు 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ ఉత్తర్వులు  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెలువరించిన కోవిడ్‌ మార్గదర్శకాల అమలులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయరాదంటూ డీజీపీ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ప్రదేశాల్లో మాత్రమే మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే పూజల సమయంలో ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మందిని అనుమతించరాదని మండపాల నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది. ఈ దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మండపాల వద్ద పూజల సమయంలో ఎక్కువ మంది సమూహాలుగా గుమికూడకుండా చూడాలని పోలీసులకు స్పష్టం చేసింది. 

ఆంక్షలు మాత్రమే.. నిషేధం విధించలేదు
హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్, పోలీసు అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ ప్రొటోకాల్స్‌కు లోబడే వినాయక ఉత్సవాల నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు నివేదించారు. ఉత్సవాలపై ఎలాంటి నిషేధం విధించలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేయరాదని మాత్రమే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మతపరమైన హక్కులన్నీ రాజ్యాంగంలోని అధికరణ 21కి లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సహేతుక ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వాలకు అధికారం ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఒకచోట సమావేశాలు నిర్వహిస్తాయని, ఇక్కడ పిటిషనర్లకు అనుమతినిస్తే రాష్ట్రవ్యాప్తంగా 4 వేల చోట్ల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ కోవిడ్‌ వ్యాప్తికి కారణం అవుతాయన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ తీర్పు వెలువరించారు.

సహేతుక ఆంక్షలు మంచిదే
రాజ్యాంగం ప్రకారం మతపరమైన కార్యకలాపాలను నిర్వహించుకునే స్వేచ్ఛ పౌరులకు ఉందని, ఇలాంటి వాటిపై సంపూర్ణ నిషేధం విధించడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. అయితే ఇదే సమయంలో శాంతి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సహేతుక ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కేశవయాన గుంట ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ ఆర్‌.మణికాంత్‌ వర్మ, ఎస్‌.ప్రశాంత్, తిరుపతి ఆటోనగర్‌కు చెందిన తమ్మా ఓంకార్‌లు వేర్వేరుగా హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు