హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప.

17 Oct, 2020 20:35 IST|Sakshi

సాక్షి, తిరుమల : శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి  అలంకారంలో దర్శనమిచ్చారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం.

అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవ మండపంలో  వాహన సేవల జరుగుతుంది.. కాగా, న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఆది‌‌వారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

మరిన్ని వార్తలు