రామతీర్థానికి కోదండరాముడు

24 Jan, 2021 06:03 IST|Sakshi
రామతీర్థానికి చేరుకున్న విగ్రహాల వద్ద ఆర్జేసీ భ్రమరాంబ, ఇతర సిబ్బంది

ఈ నెల 28న బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ట 

నెల్లిమర్ల రూరల్‌: విజయనగరం జిల్లా రామతీర్థానికి తిరుమలలో రూపుదిద్దుకున్న కోదండరాముని విగ్రహాలు శనివారం చేరుకున్నాయి. రామతీర్థంపై ఉన్న కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో స్వామివారి విగ్రహాలను తయారు చేశారు. దేవదాయ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు శుక్రవారం తిరుపతి వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్‌ వాహనంలో సీతారామలక్ష్మణస్వామి విగ్రహాలను శనివారం రామతీర్థానికి తీసుకువచ్చారు.  అర్చకులు విగ్రహాలు తీసుకువచ్చిన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడి నుంచి స్వామివారి విగ్రహాలను  రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. విగ్రహాలకు అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ..ఈ నెల 28న శాస్త్రోక్తంగా బాలాలయంలో విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు