హైవేలో లారీ పార్క్‌ చేస్తే అంతే..!

23 Jun, 2021 09:20 IST|Sakshi

ఆగి ఉన్న లారీలే టార్గెట్‌గా చోరీలు

వారం వ్యవధిలో రెండు  ఘటనలు

సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు

పలమనేరు: గంగవరం సర్కిల్‌ పరిధిలోని చెన్నై–బెంగళూరు హైవేలో ఆగి ఉన్న లారీలే టార్గెట్‌గా చోరీలు జరుగుతున్నాయి. డ్రైవర్‌ లారీని ఆపి నిద్రించే సమయంలో ఓ ముఠా చోరీలకు పాల్పడుతోంది. మొగి లిఘాట్‌ నుంచి బంగారుపాళెం మధ్యలో వారం రోజుల్లో రెండు చోరీలు జరిగినట్టు తెలిసింది. లారీల్లోని సరుకును దొంగలు మాయం చేస్తున్నారు.

నాలుగురోజుల కిందట చెన్నైనుంచి బెంగళూరుకు వెళుతున్న లారీని డ్రైవర్‌ విశ్రాంతి కోసం బలిజపల్లి సమీపంలో ఆపి నిద్రిస్తుండగా చోరీ జరిగింది. లారీ వెనుక వైపు టార్పాలిన్‌ విప్పిన దొంగలు అందులోని బటర్‌ఫ్లై కంపెనీకి చెందిన స్టౌవ్‌లను తస్కరించినట్టు తెలిసింది. నిద్రలో ఉన్న డ్రైవర్‌ లేచి చూసేసరికి దొంగలు మరో లారీలో జారుకున్నట్టు సమాచారం. మరో ఘటనలో ఇంటీరియల్‌ డిజైన్‌ పరికరాల లోడ్‌ లారీలో డ్రైవర్‌ నిద్రిస్తుండగా, అందులోనూ కొంత సామాగ్రిని దొంగలు చోరీ చేసినట్టు తెలిసింది.

సింగిల్‌ డ్రైవర్‌లున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని, డ్రైవర్‌ నిద్రపోతున్న సమయంలో లారీలు, టెంపోలు, కంటైనర్లలో చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైవేలో చెన్నై నుంచి ఖాళీ లోడ్‌తో వచ్చే లారీడ్రైవర్లు, క్లీనర్లు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రిస్తున్న డ్రైవర్‌పై మత్తుమందు కూడా చల్లుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డ్రైవర్‌ అప్రమత్తమైతే దోచుకున్న సరుకుతో తాము తీసుకొచ్చిన లారీ ఎక్కి పరారవుతున్నట్టు సమాచారం. ఈచోరీలకు సంబంధించి పోలీసులు సీసీ కెమె రా ఫుటేజీల ఆధారంగా నిందితులను గాలిస్తున్నట్టు తెలిసింది. కోవిడ్‌ నేపథ్యంలో హైవే పట్రోలింగ్‌ వాహనాలు తిరక్కపోవడం కూడా హైవేలో చోరీలకు కారణమవుతోంది. త్వరలోనే ఈ చోరీ కేసులను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.

చదవండి: కోవాగ్జిన్‌ సామర్థ్యం 77.8 శాతం

మరిన్ని వార్తలు