చిట్టీల సొమ్ము మళ్లించి మార్గదర్శి ఎదురుదాడి.. అలా చేయడం తప్పు కాదా?

19 Nov, 2022 07:56 IST|Sakshi

సొంత అవసరాలకు చందాదారుల సొమ్ము వాడుకోవడం తప్పు కాదా?

చట్ట ఉల్లంఘనలను ప్రభుత్వ ఏజెన్సీలు అంగీకరిస్తాయా?

తప్పులు జరిగితే గుర్తించడం తప్పెలా అవుతుంది

చిట్టీలు ఎవరు కడుతున్నారో కూడా చెప్పని మార్గదర్శి సిబ్బంది

తనిఖీ బృందాలకు సహాయ నిరాకరణ

బినామీ చందాదారులు ఉన్నట్లు బలపడుతున్న అనుమానాలు

ఫోర్‌మెన్‌లను డమ్మీలుగా మార్చి అంతా హెడ్‌క్వార్టర్‌ నుంచి కంట్రోల్‌

మార్గదర్శి సహా ఇతర చిట్‌ఫండ్‌ కంపెనీల్లోనూ తనిఖీలు   

సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్‌ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం కంపెనీలు నడుపుతున్న మార్గదర్శి యాజమాన్యం తప్పులను కప్పిపుచ్చేందుకు మీడియా ముసుగులో ఎదురుదాడి చేస్తోంది. మార్గదర్శిలో జరిగిన ఉల్లంఘనలు, మోసాల గురించి స్పందించకుండా ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని గగ్గోలు పెడుతోంది. తనిఖీ అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి దందాలు చేస్తాం.. అడగడానికి మీరెవరంటూ ఎదురు దాడికి దిగుతోంది. 

మార్గదర్శి సహాయ నిరాకరణ
తనిఖీల సందర్భంగా మార్గదర్శి సిబ్బంది అధికారులకు సహకరించలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారు. కనీసం చిట్‌లు ఎవరు కడుతున్నారో కూడా వెల్లడించలేదు. రికార్డులు చూపించకపోవడం, అడిగిన సమాచారం ఇవ్వకపోవడాన్ని బట్టి ఆ సంస్థలో ఇంకెన్ని మోసాలు జరిగాయోననే అనుమానాలు తనిఖీ అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శిలో చిట్టీలు ఎవరు కడుతున్నారనే జాబితాను కూడా అధికారులకు ఇవ్వలేదు. 

మాకు తెలియదు.. హైదరాబాద్‌ నుంచే 
సాధారణంగా ఏ చిట్‌ఫండ్‌ కంపెనీలోనైనా ఫోర్‌మెన్‌ ప్రధానం. ప్రతి బ్రాంచికి ఒక ఫోర్‌మెన్‌ను ఆయా కంపెనీలు నియమించుకుంటాయి. అక్కడ నిర్వహించే చిట్టీలన్నింటికీ అతడే జవాబుదారీ. ప్రతి చిట్టీ, చందాదారులు, లావాదేవీల సమాచారం అంతా అతడు చిట్స్‌ రిజిస్ట్రార్‌కి సమర్పించాలి. మార్గదర్శి బ్రాంచిల్లో ఫోర్‌మెన్‌లు మాత్రం తనిఖీ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఏ ప్రశ్న అడిగినా తమకు తెలియదని చెప్పారు. కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోని హెడ్‌ క్వార్టర్‌ నుంచే నడుస్తాయని తెలిపారు. బ్రాంచీల అకౌంట్‌లన్నీ అక్కడే ఉన్నాయని, చందాదారులు కట్టిన సొమ్మంతా అక్కడికే పంపిస్తున్నామని, తమకు చెక్‌ పవర్‌ కూడా లేదని ఫోర్‌మెన్లు చెప్పారు. అధికారులు అడిగిన చట్టబద్ధమైన సమాచారం ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. చిట్స్‌ రిజిస్ట్రార్‌ చట్టబద్ధంగా అడిగిన సమాచారాన్ని ఫోర్‌మెన్‌ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధం. హెడ్‌క్వార్టర్‌ ఆదేశాలు లేకుండా తాము ఏమీ చేయలేమని, ఏ సమాచారాన్ని వెల్లడించలేమంటూ ఫోర్‌మెన్లు తప్పించుకున్నారు. సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ల గురించి వివరణ కోరినా సాయంత్రం వరకూ రకరకాల సాకులు చెప్పి ఆ తర్వాత తమకు తెలియదని జారుకున్నారు.

పలు కంపెనీల్లో తనిఖీలు 
మార్గదర్శితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో మూడు విడతలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌), జీఎస్‌టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అక్టోబర్‌ 21, 31, నవంబర్‌ 15వతేదీల్లో ఈ తనిఖీలు జరిగాయి. 15వ తేదీన తనిఖీల సందర్భంగా మార్గదర్శి సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో వివరాల సేకరణ కోసం మూడు రోజులు ఆ సంస్థల్లో తనిఖీలు చేయాల్సి వచ్చింది. వారు సహకరించి ఉంటే మిగిలిన సంస్థల మాదిరిగానే ఒక్క రోజులో తనిఖీలు పూర్తయ్యేవి. మార్గదర్శితోపాటు కపిల్‌ చిట్స్, ఉషాబాల, క్యాపిటల్, బల్చియా, ఎస్‌టీఆర్, సూర్యచంద్ర, జగత్‌ జనని, చలపతి, చిరంజీవ, వజ్రాంకుర లాంటి పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈనాడు మాత్రం తమకు చెందిన మార్గదర్శి సంస్థల్లోనే తనిఖీలు జరుగుతున్నాయని, తమపై కక్ష సాధిస్తున్నారని బుకాయిస్తోంది.  

బలపడుతున్న అనుమానాలు 
ఫోర్‌మెన్లు సమాచారం ఇవ్వకపోవడాన్ని బట్టి చిట్టీల నిర్వహణలో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి. చిట్టీల సొమ్మును హైదరాబాద్‌లోని అకౌంట్లలోకి మళ్లించినట్లు ఇప్పటికే గుర్తించారు. మళ్లించిన డబ్బు ఏం చేస్తున్నారు? ఎక్కడ పెట్టుబడి పెట్టారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అకౌంట్లను బ్రాంచీల వారీగా నిర్వహించకుండా హెడ్‌క్వార్టర్‌ నుంచే నడిపిస్తుండడంతో చందాదారుల్లో బినామీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చందాదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేసి హెడ్‌క్వార్టర్‌కి బదిలీ చేస్తున్నట్లు వీటన్నింటిపై తనిఖీ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

ఈనాడు నీతులు ఎదుటివారికే పరిమితం
బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు, చిట్‌ఫండ్‌ కంపెనీలు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ఇష్టానుసారంగా ఇతర కంపెనీలకు, సొంత అవసరాలకు మళ్లిస్తుంటే చట్టం ఒప్పుకుంటుందా? ఉల్లంఘనలు జరగకుండా చూడడమే ప్రభుత్వ ఏజెన్సీల బాధ్యత అనే విషయం చిట్‌ నిర్వాహకులకు తెలియదా? ఖాతాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షించడమే ఆ ఏజెన్సీల ప్రధాన బాధ్యత. తప్పులు జరిగితే వాటిని గుర్తించడం తప్పు ఎలా అవుతుందో ఈనాడు యాజమాన్యమే చెప్పాలి. ప్రజాస్వామ్యం గురించి పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తూ అదంతా ఎదుటి వారికే పరిమితం.. తమకు వర్తించదనే రీతిలో ఈనాడు వ్యవహరిస్తోంది. 

మరిన్ని వార్తలు