మురిసిన మానవత్వం

3 Aug, 2022 08:26 IST|Sakshi

ఉంగుటూరు(ఏలూరు జిల్లా): నెలల తరబడి శుభ్రం చేయని శరీరం, అట్టలు కట్టిన తల, మురికి పట్టిన దుస్తులు, మాసిన గెడ్డంతో మతి స్థిమితం లేని స్థితిలో జాతీయ రహదారిపై నెలల తరబడి సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను లవ్‌ ఇన్‌ యాక్షన్‌ టీమ్‌ సభ్యులు మానవత్వంతో స్పందించి వారికి ప్రేమతో సపర్యలు చేశారు. నారాయణపురానికి చెందిన ఈ టీమ్‌ సభ్యులు వారిని చేయి పట్టుకుని తీసుకువెళ్లి నారాయణపురంలో ఏలూరు కాలువ వద్ద సోమవారం వారికి జుట్టు కత్తిరించి, గెడ్డం గీసి, పిల్లలకు చేయించినట్లు సబ్బుతో ఒళ్లు రుద్ది షాంపూతో తల స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగారు.

అనంతరం వారికి కడుపు నిండా ఆహారం అందించారు. ఈ టీమ్‌ అధ్యక్షుడు శ్రీరాముల పాలదినకరన్, ఉపాధ్యక్షుడు ఎస్‌.అబ్నేర్, కార్యదర్శి పెండ్యాల ప్రసాద్, కోశాధికారి పండుబాబు, కార్యనిర్వాహక సభ్యుడు కలపాల కుమార్‌తో మరికొంతమంది సభ్యులు ఎంతో మానవత్వంతో అందించిన ఈ సేవలను చూసినవారు వారిని మనసారా అభినందించారు.                               

మరిన్ని వార్తలు