బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..? ప్రేమికుల ఆత్మహత్య

19 Aug, 2022 15:19 IST|Sakshi

సాక్షి, చిత్తూరు(చిల్లకూరు): వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట విషం తాగి తనువు చాలించిన ఘటన గురువారం మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పొయ్య గిరిజన కాలనీకి చెందిన శివమణి, మారెక్క పెద్ద కుమారుడు మారప్ప(26), అదే కాలనీకి చెందిన వెంకటరమణయ్య, చెల్లమ్మ దంపతుల నాలుగో కుమార్తె వనజ (16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. బాలికకు యుక్తవయసు రాలేదని, కొంత కాలం ఆగాలని పెద్దలు సూచించారు. అయితే వారి సూచనలు పట్టించుకోని ప్రేమ జంట కుటుంబ సభ్యులకు తెలియకుండా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత చిల్లకూరు మండలం, తమ్మినపట్నం పంచాయతీ, గుమ్మళ్లదిబ్బలో తమకు తెలిసిన భవన నిర్మాణ కార్మికుడు మేకల వెహేసువ ఇంట్లో ఉంటూ స్థానికంగా రొయ్యల గుంటల్లో పనిచేసుకుని జీవనం సాగించారు. ఏమైందో తెలియదు కానీ గ్రామానికి సమీపంలోని కాలువ దగ్గర పురుగుల మందు తాగి ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రేమికులిద్దరూ బతుకుపై బెంగపెట్టుకుని చావుని ఎంచుకున్నారా..? కుటుంబ సభ్యులు ఎవరైనా బెదిరించారా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది.  

చదవండి: (వివాహిత మిస్సింగ్‌.. కారణం ఆ ముగ్గురు యువకులేనా?)

మరిన్ని వార్తలు