‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’

13 Aug, 2022 08:07 IST|Sakshi

సాగరతీరంలో ప్రేమ జంట ఆత్మహత్య 

సివిల్స్‌ కోచింగ్‌ కోసం వచ్చి విగతజీవులుగా మారిన వైనం 

అప్పుల వ్యవహారం బయటకు పొక్కడమే కారణం

సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఉన్నత లక్ష్యంతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య(22) గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్‌ కోచింగ్‌ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌కు వెళుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

తొలుత స్నేహితులుగా వ్యవహరించిన వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్‌ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. వివిధ అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది.  

‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’
వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్‌ చేసి రూ.లక్ష కావాలని కోరింది. అయితే అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చారు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల వద్ద అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది.

బుధవారం ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో పాటు తనకు వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్‌లో రాసి సూసైడ్‌ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్‌తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్‌ సందేశం పంపించింది. ‘కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. 

చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య)

మిస్సింగ్‌ కేసుతో వెలుగులోకి.. 
దివ్య రాసిన సూసైడ్‌ నోట్‌తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు.

దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గురువారం రాత్రి సాగరతీరంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులు ఊహించినట్లుగానే దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అయితే తొలి నుంచి వెంకటేశ్వరరెడ్డికి జల్సాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అతని ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసిగిపోవడంతో పాటు అతని అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు