శీతల గాలులు.. వర్షాలపై వాతావరణ విభాగం అంచనాలు.. ఈసారి మరింత వణుకుడే!

2 Dec, 2022 09:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపనుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో శీతాకాలం ప్రభావంపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం అంచనాలను విడుదల చేసింది. ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా రికార్డవుతాయని అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఈ మూడు నెలలు చలి ఒకింత ఎక్కువ ఉంటుందని పేర్కొంది. రానున్న రెండు నెలల్లో (డిసెంబర్, జనవరిల్లో) అప్పుడప్పుడు అతి శీతల గాలులకు ఆస్కారం ఉంది.

గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతాయని, అందువల్ల పగటి వేళ కూడా శీతల అనుభూతి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి రుతు పవనాల సీజనులో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఆ తర్వాత వచ్చే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణమని వాతావరణ  శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ చెప్పారు.

ఈ సీజనులో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు అక్టోబర్‌ నెలతో మొదలైన ఈశాన్య రుతు పవనాల సీజను డిసెంబర్‌తో ముగియనుంది. ఈ  నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షాలకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

5న అల్పపీడనం!
దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఈ నెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. 8వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై అధికంగా, దక్షిణ కోస్తాంధ్రపై మోస్తరుగా ఉండే అవకాశముంది.

వాయుగుండం ప్రభావంతో ఈనెల 6 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్‌ బృందంతో వెళ్లి..  

మరిన్ని వార్తలు