Cyclone Yaas: 24న ‘యాస్‌’ తుపాను! 

22 May, 2021 03:52 IST|Sakshi

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

రాష్ట్రంపై స్వల్పంగానే ప్రభావం 

26న ఒడిశా, బెంగాల్‌ మధ్య తీరాన్ని చేరే అవకాశం 

అండమాన్‌ సముద్రంలో ప్రవేశించిన ‘నైరుతి’ 

జూన్‌ 5 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం

సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని వణికించిన టౌటే అత్యంత తీవ్ర తుపాను బలహీనపడిన కొద్దిరోజులకే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడబోతోంది. ఉత్తర అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అది వాయవ్యదిశగా కదులుతూ వాయుగుండంగాను, ఆపై తీవ్ర వాయుగుండంగాను బలపడి ఈనెల 24న తుపానుగా మారనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ మరింతగా తీవ్రరూపం దాల్చి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్య తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది.

దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై అధికంగాను ఉంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. యాస్‌ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

యాస్‌ అంటే..
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు ఒమన్‌ దేశం సూచించిన ‘యాస్‌’ అని నామకరణం చేయనున్నారు. తుపాను ఏర్పడ్డాక ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. యాస్‌ అనే పదం పర్షియన్‌ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో జాస్మిన్‌ (మల్లెపూవు) అని అర్థం. తుపాన్లు ఏర్పడినప్పుడు వాటికి పేర్లు పెట్టడం రివాజుగా వస్తున్న సంగతి తెలిసిందే. 

రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
రానున్న తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపించనుంది. అయితే మన రాష్ట్రంలో ఎండలు ఉధృతం కావడానికి దోహదపడనుంది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో గాలివాటం మారనుంది. కొన్నాళ్లుగా నైరుతి, దక్షిణ గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఈ తుపాను ఏర్పడటానికి ముందు నుంచి రాష్ట్రంపైకి ఉత్తర గాలులు వీయనున్నాయి. ఫలితంగా అటునుంచి వచ్చే గాలులు వేడిగా ఉండడం వల్ల రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.

రాష్ట్రంలో రాబోయే 4 రోజులు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఊటుకూరులో 13 సెంటీమీటర్లు, అమడగూరులో 10, ఉంగుటూరులో 9.6, కడపలో 9, ఆగిరిపల్లిలో 8.5, కంభంలో 8, అద్దంకిలో 7.5, మొవ్వలో 7.3, బెస్తవానిపేట, పెనగలూరుల్లో 7, పొదిలి, ఉరవకొండల్లో 6, సత్తెనపల్లి, కోయిలకుంట్ల, వల్లూరుల్లో 5, జమ్మలమడుగు, వెంకటగిరికోట, దొర్నిపాడు, ప్రొద్దుటూరు, పామిడి, కమలాపురం, జూపాడుబంగ్లాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అండమాన్‌లోకి ‘నైరుతి’
మరోవైపు నైరుతి రుతుపవనాల తొలి అడుగు అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశంతోనే పడుతుంది. శుక్రవారం ఈ రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రెండు రోజుల్లో నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్న ఈ రుతుపవనాలు మన రాష్ట్రంలోకి జూన్‌ 5వ తేదీనాటికి ప్రవేశించే అవకాశం ఉంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు