‘మేకా’ వన్నె పులి

12 Aug, 2020 12:50 IST|Sakshi
వేములదీవి మ్యాక్‌ సొసైటీ కార్యాలయ భవనం

అక్రమాల పుట్ట బద్దలు 

వెలుగుచూస్తున్న వేములదీవి మ్యాక్‌ సొసైటీ అధ్యక్షుడి లీలలు 

తుది దశకు చేరుకున్న విచారణ

వేములదీవి  మ్యాక్‌ సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సొసైటీలో జరిగిన అక్రమాలపై అధికారులు విచారణ వేగవంతం చేశారు.  

నరసాపురం: టీడీపీ పెద్దల అండతో రైతుల్ని మోసగించిన వేములదీవి మ్యాక్‌ సొసైటీ అధ్యక్షుడి దోపిడీ నిర్వాకాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. అధ్యక్షుడి ముసుగులో మేకా సత్యనారాయణ సాగించిన అక్రమాలపై గతనెల 26న సాక్షిలో వచ్చిన కథనంతో సహకార శాఖ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నెల 6న విచారణ అధికారిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా సహకారశాఖ డీఆర్‌ కె.కృష్ణశృతి, బృందంలోని కృష్ణకాంత్, సుబ్రహ్మణ్యం, లక్ష్మీలతలు నరసాపురం డీసీసీబీ కార్యాలయంలో మరోమారు విచారణ జరిపారు. ఈ విచారణలో అనేక అక్రమాలు వెలుగుచూసినట్టు సమాచారం.  

బయటపడ్డ ఖాళీ సంతకాల వోచర్లు 
తాజా విచారణలో నరసాపురం డీసీసీబీ రిటైర్డ్‌ మేనేజర్‌ ఎన్‌ రామకృష్ణంరాజు, రిటైర్డ్‌ సూపరిండెంట్‌ శ్రీనివాస్, ప్రస్తుత మేనేజర్, సూపరింటెండెంట్‌లను విచారించారు. కొందరు రైతులతో మాట్లాడారు. రైతులు కేవలం సంతకాలు పెట్టిన ఖాళీ వోచర్లు 1000కి పైగా విచారణ అధికారులకు చూపించినట్లు సమాచారం. రైతులకు రుణాలిచ్చే సమయంలో అదనంగా ఈ ఖాళీ వోచర్లు తీసుకున్నారు. వాటిని వాడి రైతులకు అందాల్సిన ఆర్థిక సహకారాన్ని స్వాహా చేసినట్లు తేటతెల్లమయ్యింది. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం మేకా సత్యనారాయణ హవాకు భయపడి నోరుతెరవని రైతులు, సొసైటీ మాజీ ఉద్యోగులు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వోచర్లలో కొన్నింటిని ఓ రిటైర్డ్‌ ఉద్యోగి భద్రపరిచాడు. అవి విచారణ అధికారులకు చూపించారు.  

ధాన్యం అక్రమ వ్యాపారం 
ఒక పక్క అక్రమాలు వెలుగుచూస్తున్నా సదరు సొసైటీ అధ్యక్షుడు తన అక్రమాల పరంపర కొనసాగిస్తున్నారు. ధాన్యం అక్రమవ్యాపారానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ 1.50 కోట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. గత ప్రభుత్వం హయాంలో సొసైటీల ద్వారా జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి. తన లాబీయింగ్‌తో రైతుల నుంచి ఒక్క బస్తాకూడా నేరుగా కొనకుండా, కేవలం కాగితాలపైనే కోట్లలో వ్యాపారం చేశారు. మిల్లర్లతో మిలాఖత్‌ అయ్యారు. సొసైటీ అక్రమాల్లో కొందరు ఉద్యోగుల పాత్రపైకూడా రైతులు వ్యసాయశాఖ మంత్రికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో 25 ఏళ్లుగా సొసైటీ అధ్యక్షుడుకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల్లో కూడా గుబులు మొదలైంది.  

విచారణ చివరి దశలో ఉంది 
వేములదీవి మ్యాక్‌సొసైటీపై వచ్చిన అభియోగాలపై విచారణ జరుగుతోంది. విచారణ చివరి దశలో ఉంది. త్వరలో నివేదికలను ఉన్నతాధికారులకు అందిస్తాం.  కె కృష్ణశృతి, విచారణాధికారి 

ఈసారి న్యాయం జరుగుతుంది 
ఎన్నో ఏళ్లుగా మ్యాక్‌ సొసైటీ పేరుతో మేకా సత్యనారాయణ అక్రమాలు చేస్తున్నారు. ఈసారి స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా నేరుగా ముఖ్యమంత్రి, వ్యసాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేశాం. సొసైటీ ముసుగులో జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో సహా అందించాం. ఈసారి మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం.  పెన్మెత్స సుబ్బరాజు, ధర్బరేవు మాజీ సర్పంచ్‌  

మరిన్ని వార్తలు