Machilipatnam Train Accident: పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌

27 Apr, 2022 03:49 IST|Sakshi
పునరుద్ధరణ చేస్తున్న రైల్వే సిబ్బంది

తిరుపతి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఘటన

యార్డ్‌ నుంచి ప్లాట్‌ఫాంకు వస్తుండగా ప్రమాదం

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

తిరుపతి అర్బన్‌: తిరుపతి నుంచి మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి–మచిలీపట్నం రైలు ప్రమాదానికి గురైంది. రాత్రి 8.20గంటల సమయంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ యార్డ్‌ (షెడ్‌) నుంచి ప్లాట్‌ఫాంకు వస్తుండగా రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైల్వేస్టేషన్‌కు రెండు వందల మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేక బ్రేక్‌డౌన్‌ యంత్రాలను తిరుపతికి తెప్పించి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదంతో మూడు గంటల పాటు హరిప్రియా, తిరుమల, హంస, కాకినాడ, కదిరి–దేవరపల్లి తదితర రైళ్లకు అంతరాయం కలిగింది. ఫలితంగా వందలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి  నెలకొంది.

సిబ్బంది కొరతతోనే ప్రమాదం?
తిరుపతి యార్డ్‌లో 14 మంది సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. ఒక రైలును యార్డ్‌ నుంచి ప్లాట్‌ఫాంకు తీసుకురావడానికి ఓ షిఫ్ట్‌కు ఏడుగురు సిబ్బంది అవసరం. అయితే, ఇద్దరు, ముగ్గురు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రధానంగా షంటింగ్‌ మాస్టర్, పాయింట్‌ మెన్, డిప్యూటీ స్టేషన్‌మాస్టర్‌ తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందితోనే సర్దుకుపోతున్నారు. దీంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు