వెళితే మడమ తిప్పలేం

1 Dec, 2021 15:12 IST|Sakshi
ఒంపుసొంపుల ఏరులో..మడ అడవులు మధ్యలో.

పర్యాటకానికి అనువైన అందాల తీరం 

మంత్రముగ్దులను చేస్తున్న మడ అడవులు

ప్రకృతి రమణీయతకు ఆలవాలం

సూర్యోదయం, సూర్యాస్తమయాలు చూసే సువర్ణావకాశం

చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతిసిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ.. సాగరుడితో జతకట్టేందుకు వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ.. చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలుపోతున్నట్టు వినసొంపైన పక్షుల కిలాకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలాహిరిలో అంటూ కడలి తీరానికి సాగే పడవ ప్రయాణం.. సముద్ర జలాల మధ్యలో చూసితీరాల్సిన అందాల దీవి.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్టు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు స్వాదించాలంటే  నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.. మరి ఓసారి చూసొద్దాం రండి..  

రేపల్లె: తీరప్రాంతాన్ని విపత్తుల సమయంలో అమ్మలా కాపాడే మడ అడవులు ప్రకృతి రమణీయతతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. కార్తీక మాసాన యాత్రికులను రారమ్మంటూ పిలుస్తున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని గుంటూరు–కృష్ణా జిల్లాల తీరప్రాంతంలో పదివేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు గుంటూరు జిల్లా పరిధిలోని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో సుమారు 4వేల హెక్టార్లలో దట్టంగా అలుముకున్నాయి.    

ఆహ్లాదం.. పడవ ప్రయాణం 
నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలో పాతూరు డ్రెయిన్‌ ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్ల మేర మలుపులు తిరుగుతూ ప్రయాణించి సముద్రంలో కలుస్తోంది. ఈ డ్రెయిన్‌ ఇరువైపులా దట్టంగా విస్తరించిన మడ అడవులు విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ డ్రెయిన్‌లో పడవ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. సాగర తీరానికి ఈ మార్గంతో పాటు నక్షత్రనగర్‌ నుంచి బీఎం డ్రెయిన్‌ మీదుగా మరో మార్గమూ ఉంది. అయితే ఆ మార్గం మడ అడవులు తక్కువగా ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్లేందుకు పాతూరు లేదా నక్షత్రనగర్‌లో మెకనైజ్డ్‌ బోట్లు అందుబాటులో ఉంటాయి. బోటు మొత్తం బుక్‌ చేసుకుంటే సుమారు రూ.7వేలు తీసుకుంటారు.    

కార్తీక ‘ద్వీపం’ 
మడ అడవుల మధ్య ఆహ్లాదకర ప్రయాణం అనంతరం సముద్ర తీరానికి కొంచెం దూరంలో సహజసిద్ధంగా ఏర్పడిన అందాల ద్వీపం ఉంటుంది. ఇది ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడకు వెళ్లాలంటే సముద్రంలో కొంత దూరం పడవలో ప్రయాణించాలి. ఈ ఐలాండ్‌ సాగర స్నానాలకు అనువుగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆటపాటలతో ఉల్లాసంగా గడపొచ్చు.   సముద్ర తీరం వంపులో ఉండటంతో ఐలాండ్‌తోపాటు, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశావారిపాలెం గ్రామంలోని సముద్రంలో ఎడమ వైపు సూర్యోదయం, కుడి వైపు సూర్యాస్తమయం కనిపిస్తాయి. కన్యాకుమారి తరహాలో సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను తిలకించే అవకాశం ఇక్కడ ఉండడం విశేషం.    

ఐలాండ్‌లో వసతుల లేమి  
బోట్లు అంబాటులో లేకపోవడం వల్ల ఐలాండ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంటుంది. సరైన వసతులు లేకపోవడం కూడా యాత్రికులు రాకపోవడానికి మరో కారణం. గతంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా  మడ అడవుల నడుమ ప్రయాణించి ఐలాండ్‌లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. ఐలాండ్‌ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు కల్పించి అందుబాటులో బోట్లు ఉంచితే ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఫలితంగా తీరప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది.

,

మరిన్ని వార్తలు