మదనపల్లె వైద్య కళాశాల పనులు ప్రారంభం 

3 Jun, 2022 23:33 IST|Sakshi
వైద్య కళాశాల స్థలంలో రోడ్ల ఏర్పాటుకు సంబంధించి  మ్యాపును పరిశీలిస్తున్న ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళి 

క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళి 

మదనపల్లె : రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న వైద్యకళాశాల స్థలంలో పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఆనందరెడ్డి, డీఈ కరీముల్లా తదితరులు ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన 95.14 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

ఇందులో భాగంగా ఆ స్థలంలో అంతరరోడ్ల నిర్మాణం, ప్రహరీ, సరిహద్దులను గుర్తించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఈ ఆనందరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించిందన్నారు.

ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంటరీ పరిధిలో రూ.475 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తూ అనుమతిలిచ్చిందన్నారు. ఈ పనులకు సంబంధించి  మేఘ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ టెండర్లు దక్కించుకుందన్నారు. అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తయిందని, 30 నెలలలోపు నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం 13,31,812 చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్యకళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఆస్పత్రి భవనాలు, సిబ్బంది క్వార్టర్స్, ప్రీ–ఇంజినీర్డ్‌ బిల్డింగ్స్‌(పీఈబీ) నిర్మిస్తారన్నారు.

ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళి మాట్లాడుతూ మెడికల్‌ కళాశాల స్థలంలో పలుచోట్ల బండరాళ్లు ఉండటంతో వాటిని పగులగొట్టేందుకు బ్లాస్టింగ్‌ లైసెన్స్‌ కోసం కాంట్రాక్టర్‌ దరఖాస్తు చేసుకోవడంతో అనుమతులిచ్చేందుకు పరిశీలన చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఈశ్వరయ్య, తహసీల్దార్‌ సీకే.శ్రీనివాసులు, మేఘ సంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు.  

మెడికల్‌ కాలేజీ ఈఈగా ఆనందరెడ్డి 
మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజి ఈఈగా ఆనందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పెనుకొండ మెడికల్‌ కాలేజీ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం మదనపల్లె మెడికల్‌ కాలేజీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.   

మరిన్ని వార్తలు