జూన్ 9న వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ

8 Jun, 2022 04:37 IST|Sakshi
మహాసంప్రోక్షణకు సిద్ధమైన వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయం

విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ 

హాజరుకానున్న గవర్నర్, సీఎం, శారదా పీఠాధిపతి 

భజన బృందాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

సాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ సందర్భంగా ఈనెల నాలుగోతేదీ నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం (తొమ్మిదో తేదీ) ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.

మహాసంప్రోక్షణకు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఆలయం ఎదురుగా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. 40 మొబైల్‌ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. మూడు స్వాగత ద్వారాలు, నగరంలోని ముఖ్యమైన 50 ప్రాంతాల్లో మహాసంప్రోక్షణకు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఆలయం నుంచి ప్రధాన రోడ్డుకు అప్రోచ్‌ రోడ్డు, రెండులైన్ల బ్యారికేడ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంలో సేవలందించేందుకు వివిధ విభాగాల నుంచి దాదాపు 400 మందిని డిప్యుటేషన్‌పై నియమించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భజన బృందాల వారు కలిపి రెండువేల మంది రానున్నారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలను టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తిచానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

మహాసంప్రోక్షణ అంటే..
నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ట చేయడానికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. కార్యక్రమాల ప్రారంభానికి ముందు విష్వక్సేనపూజ, అంకురార్పణ నిర్వహిస్తారు (ఈ కార్యక్రమాలను ఈనెల 4న నిర్వహించారు). మరుసటి రోజు నుంచి ఐదురోజుల పాటు విగ్రహానికి వివిధ రకాల శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

స్వామి శక్తిని కుంభాల్లోకి (కలశాల్లోకి) ఆవాహన చేసి ప్రతిరోజు రుత్వికులు నియమనిష్టలతో ఆరాధనలు, ఉక్త హోమాలు చేస్తారు. ఈ క్రమంలో విగ్రహానికి మొదటిరోజు పంచగవ్య ఆరాధన, రెండోరోజు క్షీరాధివాసం, మూడోరోజు జలాధివాసం, నాలుగోరోజు విమాన గోపుర కలశస్థాపన, విగ్రహస్థాపన, అష్టబంధన కార్యక్రమాలు చేపడతారు.

చివరిరోజైన ఐదోరోజు మహాసంప్రోక్షణ ద్వారా కుంభాల్లోని స్వామి శక్తిని మూలమూర్తి (బింబం)లోకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ట చేస్తారు. ఈ కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం ప్రారంభమవుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 నుంచి శాంతి కల్యాణం జరుగుతుంది. ఇక్కడ స్వామి చతుర్భుజాలు, శంఖుచక్రాలు, వరద, కటిహస్తాలతో వక్షస్థలంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారితో దర్శనమిస్తారు.

ప్రత్యేక ఆకర్షణగా శంఖుచక్ర నామాలు
నూతన ఆలయం వద్ద విద్యుత్‌ దీపాలతో ఏర్పాటుచేసిన శంఖుచక్ర నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయ ప్రాకారం, విమానం, గోపురాలపై రంగురంగుల విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. ఆలయం ప్రాంగణంలో రెండున్నర టన్నుల వివిధ రకాల పుష్పాలు, 20 వేల కట్‌ ఫ్లవర్లతో సుందరంగా అలంకరించారు. 

మరిన్ని వార్తలు