హరహర మహాదేవ 

19 Feb, 2023 04:23 IST|Sakshi
కోటప్పకొండలో విద్యుత్‌ వెలుగుల్లో ప్రభలు

రాష్ట్ర వ్యాప్తంగా శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు 

తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తజనం 

పార్వతీపరమేశ్వరులకు విశేష అభిషేకాలు, పూజలు, సేవల నిర్వహణ 

సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్‌/సాక్షి, నరసరావుపేట/శ్రీకాళహస్తి రూరల్‌: హరహర మహాదేవ..శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ శివాలయాల్లో తెల్లవారు జాము నుంచే భక్తులు నదులు, కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, వివిధ వాహన సేవలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించుకుని భక్తులకు కనుల విందు చేశారు. 

శ్రీశైలం భక్తజనసంద్రం 
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తజనసంద్రంగా మారింది. నల్లమల కొండలు శివనామస్మరణతో పరవశించాయి. శనివారం మల్లన్న, భ్రమరాంబదేవిలకు దేవస్థాన ధర్మకర్తల మండలి అ«ధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్‌.లవన్న దంపతులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళపుష్పాలతో అలంకరించి ఆశీనులు గావించారు. వేదపండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా ఆదిదంపతులు ఒకటయ్యారు. 
శ్రీశైల ఆలయంపైన ఉన్న నవనందులకు అర్ధరాత్రి పాగాను అలంకరించిన దృశ్యం  

నీలకంఠుడికి పాగాలంకరణ
మహాశివరాత్రి పర్వదినాన శ్రీమల్లికార్జునస్వామికి ఆలయంపై పాగాలంకరణ శివరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకం. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వి వెంకటేశ్వర్లు స్వామి వారి గర్భాలయ విమాన గోపురం, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. 

కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు 
పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తజనంతో నిండిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శనివారం శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కోటప్పకొండ ప్రత్యేకతైన ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ఏకంగా 22 భారీ విద్యుత్‌ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  

శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తి 
దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతో మార్మోగింది. స్వామి, అమ్మవారికి ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి వారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. నంది వాహన సేవ సమయంలో ఉత్సవమూర్తులు స్వర్ణాభరణాల అలంకరణతో మెరిసిపోయారు. 

పంచారామాల యాత్ర 
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పంచారామాలైన ద్రాక్షారామం శ్రీభీమేశ్వరస్వామి దేవస్థానం, సామర్లకోట శ్రీకుమార భీమారామం, అమరావతి శ్రీఅమరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, భీమవరం సోమేశ్వరస్వామి దేవస్థానం యాత్రికులతో కిటకిటలాడాయి. అలాగే మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. 

జాగరణకు ఏర్పాట్లు 
శివాలయాల్లో జాగరణ నిమిత్తం తరలివచ్చిన భక్తుల కోసం ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. భరతనాట్యం, బుర్రకథ, హరికథ కాలక్షేపాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవార్లు జరిగేలా  సిద్ధం చేశారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు