11 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 

7 Feb, 2023 09:23 IST|Sakshi

సాక్షి, శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

12న స్వామి, అమ్మవార్లకు భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ, 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభు­త్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ, 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సాయంత్రం ప్రభోత్సవం, రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రా­త్రి 10 గంటలకు లింగోద్భవకాల మహా­న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగా­లం­కరణ, రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవా­ర్ల­కు కళ్యాణోత్సవం జరుగుతుంది. 19న సాయంత్రం స్వామి, అమ్మవార్ల రథోత్సవం, తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ, 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

(చదవండి: చాంతాడంతా చలానాలు పెండింగ్‌..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు)

మరిన్ని వార్తలు