ట్రిబ్యునల్‌ తీర్పు తర్వాతే మహానది–గోదావరి అనుసంధానం

12 Jun, 2022 05:08 IST|Sakshi

మహానది జలాలపై ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య వివాదం

దాని పరిష్కారానికి 2018లో ట్రిబ్యునల్‌ ఏర్పాటు

2023 మార్చి 11లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశం

ఈ నేపథ్యంలో అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు

న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి: మహానది జలాల వినియోగంలో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తలెత్తిన వివాదంపై ట్రిబ్యునల్‌ విచారణ నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానానికి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్‌ అభిప్రాయపడింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే అనుసంధానంపై ముందుకెళ్లాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

మహానది ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడిన తర్వాతే ఆ రెండు నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒడిశాలో బర్మూర్‌ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది.

మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన, నదుల అనుసంధానంపై కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సమగ్రంగా చర్చించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది.

మూడేళ్ల గడువులోగా ట్రిబ్యునల్‌ విచారణ పూర్తి చేయలేదు. దాంతో గడువును కేంద్రం 2023 మార్చి వరకు పొడిగించింది. ట్రిబ్యునల్‌ విచారణ కొనసాగుతుండగా అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాంతో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయించింది.

గోదావరికి మహానదిని జత చేసి
జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

247 టీఎంసీల గోదావరి జలాలకు 408 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది–గోదావరి–కావేరిలను అనుసంధానించి ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమింవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. 

మరిన్ని వార్తలు