మమ్మేల రావయ్యా.. మా శివయ్య!

3 Mar, 2022 05:36 IST|Sakshi
శ్రీకాళహస్తిలో అశేష భక్త జనసందోహం మధ్య మాడ వీధుల్లో సాగుతున్న స్వామిఅమ్మవార్ల రథోత్సవం

ప్రధాన ఆలయాల్లో  వైభవంగా విభూదీశుడి రథోత్సవాలు   

శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతిలో పులకించిన భక్తజనం

శ్రీశైలం టెంపుల్‌/అమరావతి/శ్రీకాళహస్తి రూరల్‌: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం స్వామిఅమ్మవార్లకు నిర్వహించిన రథోత్సవం నేత్రానంద భరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ముందు గల గంగాధర మండపం వద్దకు పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథోత్సవంపై ఆశీనులను చేసి సాత్విక బలి సమర్పించారు. అశేష భక్తజనం శివనామాన్ని స్మరిస్తుండగా ఆలయం పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి ముందు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయపుష్కరిణి వద్ద తెప్పోత్సవం నిర్వహించారు.

శ్రీశైలంలో రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు 

అంగరంగ వైభవంగా అమరేశ్వరుని దివ్యరథోత్సవం
అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం వైభవంగా సాగింది. అమరావతి, ధరణికోట నుంచి చింకా, ఆలపాటి, కామిరెడ్డి, కోనూరువారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశాస్త్రి పర్యవేక్షణలో పలు పూజలు నిర్వహించి రథోత్సవ ప్రారంభ క్రతువును పూర్తి చేశారు. రథాన్ని సర్వాంగసుందరంగా పూలతో అలంకరించి ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుని అందులో కొలువుదీర్చారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్‌లు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని క్రోసూరు జంక్షన్‌ వరకు లాగారు. అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథాన్ని యథాస్థానానికి చేర్చారు.

నేత్రపర్వంగా ముక్కంటీశుని రథోత్సవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ముక్కంటీశుని రథోత్సవం బుధవారం కనులపండువగా సాగంది. రథోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు దేవస్థానానికి చెందిన స్వర్ణాభరణాలను అలంకరించడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల తేజస్సును చూసి పరవశించిపోయారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు