Mahashivratri 2023: శ్రీగిరిలో బ్రహ్మోత్సవ వైభవం!

17 Feb, 2023 15:44 IST|Sakshi

నల్లమలలో ప్రతిధ్వనిస్తున్న  ఓంకార నాదం

పాతాళగంగలో పోటెత్తిన భక్తజనం

పుష్పపల్లకీలో విహరించిన భ్రామరీ సమేత మల్లన్న 

అదిగదిగో శ్రీశైలం.. భూలోకాన కైలాసం అంటూ భక్తజనం మల్లన్న ఎదుట ప్రణమిల్లుతోంది. శ్రీశైలవాసా.. శరణు మల్లన్న అంటూ నీరాజనం పడుతున్నారు. నల్లమల అభయారణ్యం మీదుగా పగలు, రేయి చిన్నాపెద్దా తేడా లేకుండా పాదయాత్రగా వచ్చే శివభక్త గణం ఎండలు మండుతున్నా.. చల్లని గాలులు వణికిస్తున్నా.. భక్తిభావం తొణకడం లేదు. అడుగులన్నీ శ్రీగిరి వైపు పడుతున్నాయి. కైలాస ద్వారం చేరుకుని మరింత ఉత్సాహంతో మల్లికార్జునుడి దర్శనానికి బారులుదీరుతున్నారు. బ్రహ్మోత్సవ సందడి అంబరాన్ని తాకుతుండగా.. భక్తజనం పులకించిపోతుంది.

శ్రీశైలంటెంపుల్‌: ఇల కైలాసమైన శ్రీశైలంలో దేవదేవుళ్లు పూలపల్లకీపై వివహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ భక్తజనం ఆనంద పరవశులై స్వామిఅమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరవ రోజు గురువారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ సేవ దివ్య పరిమళభరితంగా సాగింది. ఆలయ తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుంగంధ పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు.

పల్లకీలో స్వామి ఊరేగుతున్నంత సేపు అశేష భక్తజనవాహిని కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థాన చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ఈవో ఎస్‌.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్‌.కనకదుర్గ, అంబాల లక్ష్మీసావిత్రమ్మ, ఎం.విజయలక్ష్మి, మఠం విరుపాక్షయ్యస్వామి, ఓ.మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.   

శ్రీశైలం భక్తజన సంద్రం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేకువజామున్నే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణవేణమ్మకు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం మల్లన్న దర్శనానికి బారులుదీరుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.

భక్తులందరికీ స్వామి వారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అందరికీ అలంకార దర్శనాన్ని కల్పిస్తున్నారు. మల్లికార్జున స్వామి గర్భాలయంలో కూడా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో నాగలూటి, పెచ్చుర్వు, కైలాసద్వారం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొర్రప్రోలూరు శివస్వాములు 20 కి.మీ దూరంలోని ఆత్మకూరు డివిజన్‌లోని రోళ్ల పెంట చేరుకుని అక్కడ నుంచి నేరుగా పెచ్చెర్వుకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలక్షేత్రానికి నడకమార్గంలో మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు.   

భక్తులకు ఏ లోటు రానీయొద్దు  
ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానీయొద్దని దేవస్థానం అధికారులను ఈఓ లవన్న ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్ర పరిధిలో తాత్కాలిక వైద్యశాల, అన్న ప్రసాదవితరణ, దర్శన క్యూలైన్ల్లను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో వైద్య శిబిరాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదాల కేంద్రాల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమయానుసారంగా అన్నప్రసాదాలను అందించాలని సూచించారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందించాలని సూచించారు.

మేము.. మీకు సహాయ పడగలము! 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలదేవస్థానం ఆధ్వర్యంలో నందికూడలి వద్ద సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో కరపత్రాలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఏదేనీ సమాచారాన్ని అడిగిన వెంటనే మర్యాదపూర్వకంగా వారికి తెలియజేస్తున్నారు.  

రథశిఖర కలశానికి పూజలు
ఆదివారం రథోత్సవం సందర్భంగా రథశిఖర కలశానికి గురువారం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈఓ లవన్న ప్రత్యేక పూజల నిర్వహించి, రథశిఖర కలశాన్ని స్వయంగా మోసుకుంటూ ఆలయప్రదక్షిణ చేశారు. అనంతరం రథశిఖర కలశాన్ని సంప్రదాయబద్దంగా రథం వద్దకు చేర్చారు.     
శ్రీశైలం నేడు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ, గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు