మహాత్ముడు నడయాడిన నేల

7 Aug, 2022 19:47 IST|Sakshi

అనంతపురం జిల్లాలో పలుమార్లు పర్యటించిన గాంధీజీ

విదేశీ వస్త్రాల నిషేధం.. అస్పృశ్యతపై పోరు

ఐకమత్యంతోనే ఏదైనా సాధించగలమని పిలుపు

గాంధీజీకి విరాళాలు అందించి .. వెంట నడిచిన జనం

భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని 75 ఏళ్లవుతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు అంబరమంటుతున్నాయి దేశమంతటా. ఇంటింటా జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన మహాత్మా  గాంధీతో ‘అనంత’కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన   అడుగుజాడల్లో ఎందరో నడిచారు. జిల్లాతో మహాత్మునికి ఉన్న అనుబంధం గురించి మరోసారి మననం చేసుకుందాం.   

అనంతపురం కల్చరల్‌: స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ అనేక పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకూ వచ్చారు. 1921లో లోకమాన్య తిలక్‌ నిధి వసూలు, 1929లో ఖద్దరు నిధి వసూలు కార్యక్రమాలు, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా గాంధీజీ అనంతలో విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎప్పుడు వచ్చినా జిల్లా హార్థికంగా,  ఆర్థికంగా ఆదరించి దేశభక్తిని చాటుకుంది. గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని వచ్చి గాంధీజీని చూసి, ఆయన చెప్పింది విని అనుసరించేవారు. ప్రజలు వస్తు రూపంలో ఇచ్చిన కానుకల్ని బహిరంగ వేలం వేస్తే పోటీ పడి కొనేవారు.  

దురాచారాలు రూపుమాపండి 
1921 సెప్టెంబర్‌ 20న గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. కలచవీడు వెంకటరమణాచార్యులు గాంధీజీని పద్యాలతో స్తుతించారు. గాంధీజీ హిందూ– ముస్లింల ఐక్యత, జూదం, తాగుడు, వ్యభిచారం మానమని, అస్పృశ్యతను వీడాలని బోధించారు. ఆ సభలో వేలాది మంది స్త్రీలు తమ ఆభరణాలను స్వాతంత్య్ర సమరానికి విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 30న గాంధీజీని అరెస్టు చేస్తారన్న వదంతులు వ్యాపించడంతో బ్రిటీష్‌వారిని అడ్డుకోవడానికి కల్లూరు సుబ్బారావు ఆయన వెన్నంటే ఉన్నారు.  

అప్పుడే ఖద్దరు వస్త్రధారణ.. 
1929 మే 16న గాంధీజీ మరోసారి ‘అనంత’ పర్యటనకొచ్చారు. కదిరి, కుటాగుళ్ల, ముదిగుబ్బ, దంపెట్ల గ్రామాలు తిరిగి అదే రోజు రాత్రి ధర్మవరం చేరుకున్నారు. దంపెట్ల గ్రామ ప్రజలు చిత్రావతి నది ఇసుకలో ఇరుక్కుపోయిన గాంధీజీ కారును దాటించారు. ధర్మవరంలో ప్రసంగించిన         అనంతరం ఆయన అనంతపురం చేరుకున్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆయన వెంట ఉన్నారు. ఖద్దరు కట్టండని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో విదేశీ వస్త్రాలు తగలబెట్టి అనంతవాసులు భారతీయత ఉట్టిపడే ఖద్దరు వస్త్రాలు ధరించారు. అనంతరం గాంధీజీ  తాడిపత్రికి వెళ్లారు. అక్కడ హైస్కూలు డ్రాయింగ్‌ మాస్టర్‌ 107 అక్షరాలు రాసి బహూకరించిన  బియ్యపు గింజ వేలం వేశారు. రూ.5,330 నిధి వసూలు అయ్యింది. 

అడుగడుగునా విరాళాల వెల్లువ  
1934లో గాంధీజీ గుత్తి స్టేషన్‌కు వచ్చారు. కల్లూరు సుబ్బారావు తదితరులు తోడుగా ఆయన పెద్దవడుగూరుకు వెళ్లారు. అక్కడ చిన్న నారపరెడ్డి రూ.1116 విరాళంగా వచ్చిన «మొత్తాన్ని కేశవ పిళ్లై స్మృతి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించిన కేశవ విద్యాలయానికి అందజేశారు. అంటరానితనం కొనసాగితే హిందూమతం అదృశ్యమవుతుందని గాంధీజీ ప్రబోధించారు. అక్కడ కూడా మరో  డ్రాయింగ్‌ టీచర్‌ శ్రీనివాసన్‌ ఒక బియ్యపు గింజపై గాంధీ బొమ్మను చెక్కి బహూకరించారు.

గుత్తి హైస్కూలు మైదానంలో జరిగిన సభలో కొందరు హరిజన విద్యార్థులు గాంధీజీని పద్యాలతో సత్కరించారు. అనంతరం గుత్తి నుంచి గుంతకల్లు వెళ్లే మార్గంలో తిమ్మన దర్గాలో ఒక తోళ్ల యజమాని కొడుకైన మహదేవ అనే ఏడేళ్ల కుర్రాడు గాంధీజీకి బంగారు ఉంగరం ఇచ్చాడు. అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్న గాంధీజీ అందరిలోనూ హృదయ పరివర్తన రావాలని.. అప్పుడే స్వాతంత్య్రం త్వరగా సిద్ధిస్తుందని చైతన్యపరిచారు. అక్కడ ఇద్దరు రైతులు విడివిడిగా కానుకలివ్వడంతో అందరూ ఐకమత్యంగా ఉంటేనే కానుకలు స్వీకరిస్తానని సంఘటితపరిచారు. అక్కడి నుంచిఅనంతపురం చేరుకున్న గాంధీజీ హరిజన కాలనీలో కుళాయి ప్రారంభించారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ హరిజనుల పట్ల భేదభావం రూపుమాపుకోవాలని పిలుపునిచ్చారు. అంటరానితనం పోయేంత వరకు తనకు మనశ్శాంతి లేదని ఆవేదన చెందారు.  

ఇలా జిల్లాలో పర్యటించిన గాంధీజీని చూడడానికి వేల సంఖ్యలో బండ్లు కట్టుకుని వచ్చేవారని అప్పటివారు చెపుతారు. ఆయన్ను చూడడం, ఆయన చెప్పింది శ్రద్ధగా వినడం, మనసా వాచా కర్మణా ఆచరించడం చేసేవారు. గాంధీజీ రగిలించిన స్ఫూర్తితోనే భారతమాత స్వాతంత్య్ర సముపార్జనలో ‘అనంత’ వాసులు కీలక పాత్ర పోషించారు. 

ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి..
స్వాతంత్య్రోద్యమ పోరును కనులారా చూసిన భాగ్యం భగవంతుడు నాకు కల్పించినందుకు మురిసిపోతుంటాను. నా వయసు 95 ఏళ్లు. నేను ఇప్పటికీ పాత విషయాలన్నీ మా పిల్లలకు తరచుగా చెబుతుంటా. మా నాన్న వెంకటరమణప్ప, అమ్మ నారాయణమ్మ. రైతు కుటుంబం. అనంతపురంలోనే ఉండేవాళ్లం. బహుశా నాకు 9, 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడనుకుంటా.. మహాత్మా గాంధీ ధర్మవరానికి వచ్చిన        సమయంలో నేను బంధువుల ఇంట్లో అక్కడ ఉన్నా. ఆనాడు గాంధీజీ మాట్లాడిన మాటలు అర్థం కాలేదు కానీ మేము దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేదాకా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాం. నేను పాతూరులోని కస్తూరిబా పాఠశాలలో చదువుకునేదాన్ని.          
 – ఆనెగొంది సుభద్రమ్మ, అనంతపురం  

మరిన్ని వార్తలు